Dailyhunt
Weather Update : రానున్న 3 రోజులు జాగ్రత్త.. ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు పడే ఛాన్స్

Weather Update : రానున్న 3 రోజులు జాగ్రత్త.. ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు పడే ఛాన్స్

hmtv 1 week ago

Weather Update : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం చిత్రవిచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపం చూపిస్తుంటే, మరోవైపు అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకొచ్చి వానలు కురుస్తున్నాయి.

రానున్న మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. అటు ఎండలు, ఇటు ఉరుములతో కూడిన వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఒక వాతావరణ ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 50-60 కిమీ వరకు ఉండవచ్చని హెచ్చరించారు.

నిప్పులు చెరుగుతున్న ఎండలు

వర్షాల సంగతి పక్కన పెడితే, రాష్ట్రంలో ఎండల తీవ్రత భయంకరంగా ఉంది. సోమవారం కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు 16 జిల్లాల్లోని 74 మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్కును దాటేశాయి. విజయవాడ, నంద్యాల, నెల్లూరు వంటి నగరాల్లో ఉక్కపోత, వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. వర్షం కురిసే ముందు వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు నీరసానికి గురవుతున్నారు.

తెలంగాణలోనూ ఇదే పరిస్థితి

తెలంగాణలో కూడా వాతావరణం అనిశ్చితంగా ఉంది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మధ్యాహ్నం వరకు ఎండ దంచికొడుతుంటే, సాయంత్రం అయ్యేసరికి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఎండల తీవ్రత 42 డిగ్రీలకు పైగా నమోదవుతోంది. ఇక్కడ కూడా ద్రోణి ప్రభావంతో గాలిలో తేమ పెరిగి ఉక్కపోత విపరీతంగా ఉంటోంది.

ప్రజలకు, రైతులకు కీలక సూచనలు

వాతావరణంలో చోటు చేసుకుంటున్న ఈ ఆకస్మిక మార్పుల వల్ల పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రైతులు, పశుకాపరులు వర్షం పడే సమయంలో చెట్ల కింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. బలమైన ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు, పాత భవనాల కింద నిలబడటం శ్రేయస్కరం కాదని తెలిపారు. ఎండల నుంచి రక్షణ కోసం ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu