Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. రాగల 5 రోజులు వర్షాలు!
Weather Update: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వాతావరణ పరిస్థితులను గమనిస్తే.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి జల్లులు పడే అవకాశం ఉంది.
సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణం ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీ తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున, వేటకు వెళ్లే మత్స్యకారులు తీరం దాటవద్దని, పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణలోనూ రాబోయే ఐదు రోజులు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

