Dailyhunt
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఒకవైపు ఎండల మంట, మరోవైపు వానల బీభత్సం

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఒకవైపు ఎండల మంట, మరోవైపు వానల బీభత్సం

hmtv 1 week ago

Weather Update

Weather Update

Weather Update : రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రంగా మారింది. ఒకవైపు భానుడు తన ప్రతాపం చూపిస్తూ నిప్పుల వర్షం కురిపిస్తుంటే, మరోవైపు అకాల వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

ఎండలు, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. సాయంత్రం వేళ వచ్చే గాలివానలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఎండలు మామూలుగా లేవు. నెల్లూరు జిల్లా గూడూరులో ఈ వేసవిలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లాలో కూడా 46.1 డిగ్రీలతో జనం అల్లాడిపోయారు. అయితే సాయంత్రం అయ్యేసరికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముమ్మిడివరంలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు రాయలసీమ, దక్షిణ కోస్తాలో వడగాల్పుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఎండలు, వానలు ఒకేసారి పలకరించడంతో ప్రజలు వింత అనుభూతికి లోనవుతున్నారు.

ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు ఏపీలో భారీ నష్టాన్ని మిగిల్చాయి. బాపట్ల జిల్లా పర్చూరులో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి ఏకంగా 40 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నెల్లూరులో కూడా పెనుగాలుల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి పలు వీధులు అంధకారంలో మునిగిపోయాయి. ఒంగోలులో గాలి తీవ్రతకు పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. ఓ ఎగ్జిబిషన్‌లో బెలూన్ కూలిపోయింది, తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆత్మకూరులో మామిడి కాయలు రాలిపోవడంతో తోట యజమానులు లబోదిబోమంటున్నారు.

అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న విత్తనాలు వర్షానికి తడిచిపోయాయి. పర్చూరు మండలంలో ఆరు ఎకరాల మిర్చి పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరబోసిన పంటను కాపాడుకునేలోపే వాన ముంచెత్తడంతో ఏం చేయాలో పాలుపోక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. గాలివానల వల్ల రేకుల షెడ్లు ఎగిరిపోవడంతో సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు.

తెలంగాణలో ఎండల తీవ్రత భయంకరంగా ఉంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో గరిష్టంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, జగిత్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలు నిప్పుల కొలిమిని తలపించాయి. దురదృష్టవశాత్తూ ఆదిలాబాద్‌లో ఓ పంచాయతీ కార్మికుడు వడదెబ్బ తగిలి మరణించాడు. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. వేసవి తీవ్రత దృష్ట్యా ఆహారం, ద్రవ పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రానున్న మూడు రోజులు వర్ష సూచన జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉండటంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. ఏపీలో కూడా శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో ఏడో తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu