Dailyhunt
Zambia Walking Safari: జాంబియా సఫారిలో నడక ప్రయాణం... ప్రపంచ యాత్రికుల సాహసం

Zambia Walking Safari: జాంబియా సఫారిలో నడక ప్రయాణం... ప్రపంచ యాత్రికుల సాహసం

hmtv 5 days ago

Zambia Walking Safari: ఆఫ్రికా అంటేనే జీపుల్లో వెళ్తూ సింహాలను, ఏనుగులను చూడటం అని అందరూ అనుకుంటారు. కానీ జాంబియాలోని 'వాకింగ్ సఫారి' పర్యాటకానికి సరికొత్త అర్థాన్ని ఇస్తోంది.

వాహనాల చప్పుడు లేకుండా, అడవి తల్లి ఒడిలో నేరుగా అడుగులు వేస్తూ మృగాలను పలకరించే ఈ సాహసయాత్ర ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.

అడవిలో అడుగులు.. గుండెల్లో దడ!

జాంబియాలోని 'మోసి-ఓ-తున్యా' నేషనల్ పార్క్‌లో సాగే ఈ ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవం. గైడ్ థామస్ ములోంగా నేతృత్వంలో పర్యాటకులు ఒకరి వెనుక ఒకరు నిశ్శబ్దంగా అడవిలోకి ప్రవేశిస్తారు. రక్షణ కోసం తుపాకులు ధరించిన స్కౌట్లు ఉన్నప్పటికీ, గడ్డిలో పొంచి ఉన్న చిరుతపులి లేదా పొదల్లోంచి దూసుకొచ్చే భారీ ఏనుగును తలచుకుంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టడం సహజం.

వైట్‌ రైనోతో ముఖాముఖి

జాంబియా సఫారీలో నడక ప్రయాణంలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం సౌతర్న్‌ వైట్‌ రైనో. దీనినే తెల్ల ఖడ్గమృగం అని పిలుస్తారు. ఇలాంటి అరుదైన ఖడ్గమృగాలు ఆఫ్రికా ఖండంలో మాత్రమే కనిపిస్తాయి. ఈ అరుదైన తెల్ల ఖడ్గమృగాలకు అధికారులు పేర్లు పెట్టారు. ఈ పేర్లు కూడా మన పేర్లు మాదిరిగానే ఉంటాయి. భారీ చెట్ల నీడలో ఖడ్గమృగాలు సేదతీరడం మనకు సాధారణంగా కనిపించే అంశం. అవి నిద్రలో ఉండగా వాటిని చూస్తూ ఉండాలే తప్పించి నిద్రలేపడం వంటివి చేయకూడదు. సాధారణంగానే ఖడ్గమృగాలకు కోపం ఎక్కువ. దాడి చేసేందుకు కూడా వెనుకాడవు. సఫారీలో జీవులో వెళ్లే సమయంలో వచ్చే శబ్దాలకు ఇవి దూరంగా వెళ్లిపోతుంటాయి. కానీ, సఫారీలో నడక ప్రయాణంలో ఇలాంటి అరుదైన జీవుల జీవితాన్ని దగ్గర నుంచి ఆస్వాదించవచ్చు. ఖడ్గమృగం చర్మంపై ఉన్న ముడతలు, అది పీల్చే శ్వాస కూడా మనకు స్పష్టంగా వినిపిస్తుంది. ప్రకృతికి ఇంత దగ్గరగా వెళ్లడం అంటే అది ఒక ఆధ్యాత్మిక అనుభవమే అని పర్యాటకులు చెబుతున్నారు.

ఎందుకు ఈ నడక ప్రయాణం?

ప్రస్తుతం కెన్యా, టాంజానియా వంటి దేశాల్లో పర్యాటక వాహనాల రద్దీ పెరిగిపోయి అడవిలోని ప్రశాంతత దెబ్బతింటోంది. దీనికి భిన్నంగా జాంబియా 1950ల నుంచి 'వాకింగ్ సఫారి'ని ప్రోత్సహిస్తోంది. వాహనంలో వేగంగా వెళ్తే కనిపించని చిన్న చిన్న అద్భుతాలు... అంటే నేల మీద పాకే చీమలు, రంగురంగుల బల్లులు, అడవి పూల సువాసనలు నడకలో మనకు పరిచయమవుతాయి. అంతేకాదు, శబ్దం లేకుండా, కాలుష్యం లేకుండా అడవికి ఎలాంటి హాని చేయకుండా సాగే పర్యాటకం ఇది. ఇక్కడి గైడ్లు సంవత్సరాల తరబడి శిక్షణ పొంది, మృగాల అడుగుజాడలను బట్టి అవి ఎటు వెళ్లాయో చెప్పగల దిట్టలు. గైడ్‌ లేకుండా ఒంటరిగా అడవిలోకి ప్రయాణం చేయడం నిషిద్దం.

"అడవిని చూడటం వేరు.. అడవిలో ఒక భాగమై బతకడం వేరు" అంటారు జాంబియా సఫారి గైడ్లు. కేవలం 2 నుంచి 3 శాతం మంది మాత్రమే ఇలాంటి సాహసానికి మొగ్గు చూపుతున్నప్పటికీ, ఒక్కసారి నడక ప్రయాణం చేసిన వారు మళ్లీ జీపు ఎక్కడానికి ఇష్టపడరు. ఇది కేవలం యాత్ర మాత్రమే కాదు, మన లోపల నిద్రిస్తున్న ప్రకృతి ప్రేమికుడిని నిద్రలేపే ఒక అద్భుత ప్రయాణం. ఆఫ్రికా అడవుల అసలైన పరిమళాన్ని పీల్చాలంటే జాంబియాలో నడవాల్సిందే! ఎప్పుడైనా ఆఫ్రికా వెళ్తే తప్పనిసరిగా జాంబియా వాకింగ్‌ సఫారీకి వెళ్లండి. మీకే అర్థమౌతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu