బీవీఎస్ రవి మాటలు కోటలు దాటాయ్.. కానీ చేతలు?
తెలుగు సినిమాల ప్రయాణం ప్రస్తుతం ఎలా సాగుతోందో తెలిసిందే. ఒక వైపు వరల్డ్ స్థాయి సినిమాల్ని తీసే దర్శకులుంటే..
మరో వైపు అవే రొటీన్ రొడ్డ కొట్టుడు కథలతో సినిమాల్ని తీస్తూ డిజాస్టర్లను అందిస్తున్నారు. ఇలాంటి సమయంలో దర్శక, నిర్మాత, రచయిత బీవీఎస్ రవి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రైటర్‌గా బీవీఎస్ రవి ఖాతాలో కొన్ని హిట్లున్నాయి. అయితే దర్శకుడిగా బీవీఎస్ రవికి చేదు అనుభవమే ఉంది. ఆయన తీసిన జవాన్, వాంటెడ్ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక అప్పటి నుంచి మళ్లీ దర్శకత్వ ఆలోచనలు చేయలేదు. బీవీఎస్ రవి అందించిన కథతో 'థాంక్యూ' మూవీ తీస్తే అది అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
బీవీఎస్ రవికి ఆహా అన్ స్టాపబుల్ షో కమ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. కానీ సినిమాల్లో మాత్రం బీవీఎస్ రవి మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వలేకపోతోన్నాడు. ఇక రైటింగ్ కాకుండా యాక్టింగ్‌లోకి వచ్చిన తరువాత బీవీఎస్ రవి పోషిస్తున్న పాత్రలు కూడా దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా మిస్టర్ బచ్చన్ చిత్రంలో బీవీఎస్ రవి పోషించిన పాత్ర, చెప్పిన డైలాగ్‌ను మీమర్స్, ట్రోలర్స్ ఎంతగా వాడుకుంటున్నారో తెలిసిందే. ఇలాంటి బీవీఎస్ రవి తాజాగా తెలుగు సినిమా కథా పరిణామ క్రమం మీద కామెంట్ చేశారు.
కొత్తగా కథల్ని క్రియేట్ చేయలేం అని, ఉన్న కథల్నే కొత్తగా చెప్పే ప్రయత్నం చేయాలని అన్నారు. దేవదాస్ సినిమాలోని ఎమోషన్‌ను పట్టుకుని మళ్లీ దేవదాస్, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, అర్జున్ రెడ్డి వంటి చిత్రాలెన్నో చేశారని బీవీఎస్ రవి తెలిపారు. సినిమాలో ఎన్ని రకాల అంశాలు, హంగులైనా పెట్టుకోవచ్చు కానీ.. కథ, కోర్ ఎమోషన్స్, కాన్‌ఫ్లిక్ట్, క్రైసిస్ అనేది ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. కథ లేకుండా ఎన్ని హంగులు పెట్టిన, ఎంత రిచ్‌గా తీసినా, భారీ ఫైట్స్, ఎలివేషన్స్ పెట్టినా మూవీస్ వర్కౌట్ అవ్వవు అని అన్నారు.
ఓ కథలో ఏం ఉండాలి.. సినిమా ఎలా ఉండాలి.. ఏ ఏ అంశాలుండాలనే విషయాలు ఇంత క్లారిటీగా చెప్పిన బీవీఎస్ రవి.. ఓ మంచి కథను ఎందుకు రెడీ చేయలేకపోతోన్నాడు? ఎందుకు ఓ హిట్టు సినిమాని అందించలేకపోతోన్నాడు? అన్నది మాత్రం తెలియడం లేదు. ఇక ధురంధర్‌లో ఉండే అన్ని పాత్రల్ని చక్కగా ఎస్టాబ్లిష్ చేశారని, అలాంటి డ్రామాతో సినిమాని తీస్తే ఎన్ని గంటలు ఉన్నా కూడా ఆడియెన్స్ చూస్తారని అన్నారు. డ్రామా కథల్ని రాయడమే చాలా క్లిష్టమని, అలాంటి డ్రామాతోనే విజయేంద్ర ప్రసాద్ ఎన్నో కథల్ని రాశారని అన్నారు.
రాజమౌళిలా సినిమాని తీయాలని అంతా అనుకుంటారు కానీ.. అందులో విజయేంద్ర ప్రసాద్ గారి కథ వల్లే అలాంటి డ్రామా, ఎమోషన్ పుడుతుందని తెలుసుకోలేకపోతోన్నారు అని బీవీఎస్ రవి తెలిపారు. కాపీ కొట్టడం సహజం అని, కాకపోతే ఏం కాపీ కొడుతున్నామనేది ముఖ్యమని, ఎమోషన్‌ను కాపీ కొట్టి తీస్తే సినిమాలు హిట్ అవుతాయని అన్నారు. ఇలా బీవీఎస్ రవి మాట్లాడిన మాటలు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి. కథలు, స్క్రిప్ట్ రైటింగ్‌పై ఇంత పట్టు ఉన్న బీవీఎస్ రవి నుంచి ఓ అద్భుతమైన కథ ఎప్పుడు వస్తుందో అని ఆడియెన్స్ అనుకుంటున్నారు.

