ఏప్రిల్ 30 (జనం సాక్షి).కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనం లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ విషాదకర సంఘటన తిమ్మాపూర్ మండల పరిధిలోని అలుగునూరు వంతెనపై బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌కు చెందిన 12 మంది వలస కార్మికులు కటికేనపల్లిలో నివాసం ఉంటూ హమాలీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.కాగా, రెండు రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌కు ఉపాధి కోసం వెళ్లారు. పనులు ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం వేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

