పర్వతగిరి మే 15: (జనం సాక్షి)విద్యా వారోత్సవాల లో భాగంగా నిర్వహించిన బడిబాట కార్యక్రమం పురస్కరించుకొని, పర్వతగిరి మరియు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని జెడ్పిహెచ్ఎస్ పర్వతగిరి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కందుకూరి నవీన్ కుమార్ కోరారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలు పిల్లల చదువుల గురించి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలని వారిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం నుండి ప్రభుత్వం 9 వస్తువులతో కూడిన ఉచిత కిట్ ప్రతి విద్యార్థికి అందిస్తుందని ఈ అవకాశాన్ని మండలంలోని తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరారు. సీనియర్ ఉపాధ్యాయులు పాక రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రైవేటు పాఠశాల లో చదివే విద్యార్థులకు దీటుగా తయారు చేస్తామని అన్నారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ నాజియా సల్మా మాట్లాడుతూ తల్లితండ్రులు లేని అమ్మాయిలను కస్తూర్బా గాంధీ విద్యా నిలయం పర్వతగిరి లో చేర్పించాలని కోరారు. ఇంటర్లో కూడా అమ్మాయిలకు అడ్మిషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ బడిబాట కార్యక్రమంలో ఇరు పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

