Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చీలపల్లి వరుస చోరీల కేసులను ఛేదించిన పోలీసులు

చీలపల్లి వరుస చోరీల కేసులను ఛేదించిన పోలీసులు

కోటి ముప్పై ఐదు లక్షల విలువైన బంగారం, వెండి వస్తువుల రికవరీ

విశేషంగా కృషి చేసిన పోలీసు బృందాలకు రివార్డులు

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

మెదక్ జిల్లా బ్యూరో చీఫ్, మే 24 ( జనం సాక్షి ): మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చిలపల్లి గ్రామంలో వరుసగా జరిగిన చోరీల కేసులను మెదక్ జిల్లా పోలీసులు అత్యంత వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి.

శ్రీనివాసరావు తెలిపారు. దొంగిలించబడిన భారీ మొత్తంలో బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాలను మీడియా సమావేశంలో వెల్లడిస్తూ…ఈ నెల 14వ తేదీ రాత్రి గ్రామంలోని తాళం వేసిన ఐదు ఇండ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. సుమారు 109 తులాలు 9 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండున్నర కిలోల వెండి వస్తువులు, రూ.19 వేల నగదు అపహరించారు.

మరో ఇంట్లో మూడు తులాల బంగారం దొంగిలించారు. ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, గూఢచారి సమాచారంతో నిందితులను గుర్తించి రామాయంపేట సమీపంలో చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 929.7 గ్రాముల బంగారం, 1.7 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు జాదవ్ జైరాం నాయక్ అలియాస్ జెమ్లా నాయక్‌పై ఇప్పటికే పలు జిల్లాల్లో అనేక చోరీ కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

శంకరంపేట-ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఐదు కేసులతో పాటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో జరిగిన మరో 12 కేసులను కూడా నిందితుడు ఒప్పుకున్నాడు. మొత్తం 17 కేసుల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. నిందితులను వేగంగా పట్టుకున్నందుకు బాధితులు రాములు, మాణిక్ రెడ్డి జిల్లా ఎస్పీతో పాటు కేసు దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిని శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా బాధితుడు రాములు మాట్లాడుతూ తమ బంగారం మళ్లీ దొరుకుతుందని ఆశించలేదని, దొంగతనం జరిగినప్పటి నుంచి పోలీసులు అండగా నిలిచి ధైర్యం చెప్పారని తెలిపారు. రాత్రింబవళ్లు కష్టపడి కేసును ఛేదించిన పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. తమ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కేసులో విశేషంగా కృషి చేసిన ఐదు ప్రత్యేక బృందాల సిబ్బందికి రివార్డులు, నగదు పురస్కారాలు అందజేశారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన బంగారాన్ని బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని అవగాహన కల్పించారు. అత్యవసర సహాయం కోసం డయల్ 100ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐలు రేణుక రెడ్డి, జార్జ్, సందీప్ రెడ్డి, ఎస్ఐలు శంకర్, ప్రవీణ్ రెడ్డి, పోచయ్య, సీసీఎస్ బృందం, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi