Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఉక్కుపాదం: ఎమ్మెల్యే గండ్ర

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఉక్కుపాదం: ఎమ్మెల్యే గండ్ర

యశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే రైస్ మిల్లులను సీజ్ చేయడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు.

బుధవారం రెండోరోజు కూడా జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గణపురంలోని లక్ష్మీ గణపతి రైస్ మిల్, భూపాలపల్లి మండలం గొర్లవేడులోని వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం దిగుమతి అవుతున్నా రైతులకు ట్రక్ షీట్‌లు ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంటా పూర్తవగానే ట్రక్ షీట్‌లు ఇవ్వాలని, ఆలస్యానికి గల కారణాలపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ట్రక్ షీట్‌లు లేకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయొద్దని, ఇలాంటి చర్యల వల్ల జిల్లాకు చెడ్డ పేరు వస్తుందని అన్నారు. అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టమని, మిల్లులను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగేలా పనిచేస్తే పూర్తి సహకారం ఉంటుందని, కానీ అక్రమాలను ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. గత ఎనిమిదేళ్లుగా జరుగుతున్న దోపిడీ పద్ధతులు ఇకపై కొనసాగవద్దని, తక్షణమే సరిచేసుకోవాలని సూచించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ట్రక్ షీట్‌లు ఇవ్వడం తప్పనిసరి చేయాలని, దీనిపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. వర్షాలు వస్తే రైతులు ఇబ్బంది పడతారని, మిల్లర్లు హమాలీలను పెంచి ధాన్యం దిగుమతిని వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాలియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi