Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ క్రికెట్‌కు కొత్త దిశ - హెచ్‌సీఏలో కీలక బాధ్యతలు చేపట్టిన ఏ.టి. రాయుడు

హైదరాబాద్ క్రికెట్‌కు కొత్త దిశ - హెచ్‌సీఏలో కీలక బాధ్యతలు చేపట్టిన ఏ.టి. రాయుడు

ప్పల్, మే 06 ( జనం సాక్షి ): హైదరాబాద్ క్రికెట్ అభివృద్ధికి మరింత బలం చేకూర్చే కీలక నిర్ణయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్సిఏ ) తీసుకుంది.

భారత జట్టుకు సేవలందించిన అనుభవజ్ఞుడైన క్రికెటర్ ఏ.టి. రాయుడిని హెడ్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్‌గా నియమిస్తూ అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకం ద్వారా హైదరాబాద్ క్రికెట్‌లో పారదర్శకత, ప్రతిభకు ప్రాధాన్యం, అభివృద్ధి లక్ష్యాలతో కొత్త దిశలో ముందుకు సాగాలని హెచ్‌సీఏ నిర్ణయించింది.ఈ బాధ్యతలతో రాయుడు రాష్ట్రంలోని క్రికెట్కార్యకలాపాలన్నింటినీ సమగ్రంగా పర్యవేక్షించనున్నారు. క్లబ్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే టోర్నమెంట్లు, ఆటగాళ్ల అభివృద్ధి కార్యక్రమాలు, కోచింగ్ విధానాలు, ఎంపికల ప్రక్రియ వంటి అంశాలన్నింటిపై ఆయన పర్యవేక్షణ ఉంటుంది.

ముఖ్యంగా యువ ప్రతిభను వెలికి తీసి వారికి సరైన అవకాశాలు కల్పించడం, హైదరాబాద్‌ను మళ్లీ దేశ క్రికెట్ పటంలో ముందంజలో నిలపడం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.క్రికెట్‌లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ హెచ్‌సీఏ అవినీతి నిరోధక విభాగాన్ని (ఏ యు సి) కూడా ఏర్పాటు చేసింది. విజేందర్ పింగ్లే ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఎంపికలలో అక్రమాలు, లంచాలు, ఇతర అవకతవకలను పూర్తిగా నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోనుంది.ఈ సందర్భంగా ఏ.టి. రాయుడు స్పష్టంగా మాట్లాడుతూ, "క్రికెట్‌లో అవినీతికి ఎలాంటి స్థానం ఉండదు.

లంచాలు, ఎంపికలలో జరిగే అక్రమాలకు జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తాం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లకే అవకాశాలు కల్పిస్తాం" అని తెలిపారు. ఆటగాళ్ల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా మాత్రమే జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.అలాగే కొత్త ప్రతిభను వెలికితీసేందుకు ఓపెన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు రాయుడు వెల్లడించారు. నగరంతో పాటు జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ టాలెంట్‌ను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.

దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా మంచి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇక రాబోయే క్రికెట్ లీగ్ సీజన్ మే 12 నుంచి ప్రారంభం కానుందని హెచ్‌సీఏ ప్రకటించింది. ఈ సీజన్‌ను మరింత పారదర్శకంగా, పోటీతో కూడిన విధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మ్యాచ్‌ల నిర్వహణ, అంపైరింగ్, స్కోరింగ్ వంటి అన్ని విభాగాల్లోనూ నాణ్యతను పెంచే చర్యలు తీసుకుంటున్నారు.హైదరాబాద్‌లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రికెట్ మౌలిక వసతుల అభివృద్ధికి హెచ్‌సీఏ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. కొత్త గ్రౌండ్లు, నెట్ ప్రాక్టీస్ సదుపాయాలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు మెరుగైన అవకాశాలు కల్పించనుంది.మొత్తానికి, ఏ.టి. రాయుడు నియామకం హైదరాబాద్ క్రికెట్‌లో ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతున్నదని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. పారదర్శకత, ప్రతిభకు ప్రాధాన్యం, గ్రామీణ స్థాయిలో అభివృద్ధి వంటి అంశాలతో హెచ్‌సీఏ తీసుకున్న ఈ నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయని ఆశిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi