జడ్చర్ల, మే 15 (జనంసాక్షి): జడ్చర్ల పురపాలక సంఘం కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
గత కొంతకాలంగా మున్సిపాలిటీ పరిధిలో విపరీతమైన అవినీతి జరుగుతోందని, వివిధ పనుల కోసం అధికారులు ముక్కుపిండి లంచాలు వసూలు చేస్తున్నారంటూ వచ్చిన పలు ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు ఈ దాడులు చేపట్టారు. మహబూబ్ నగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సిహెచ్. బాలకృష్ణ ఆధ్వర్యంలో పది నుండి పదిహేను మంది అధికారుల బృందం కార్యాలయంలోకి ప్రవేశించి ఏకకాలంలో అన్ని విభాగాల్లో సోదాలు ప్రారంభించింది. ఇంజనీరింగ్, శానిటేషన్, రెవెన్యూ, జనన-మరణాల ధృవీకరణ పత్రాల విభాగాలతో పాటు భవన నిర్మాణ అనుమతులకు (టౌన్ ప్లానింగ్) సంబంధించిన కీలక రికార్డులను, ఫైళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
రాజకీయంగా, పరిపాలనాపరంగా తీవ్ర చర్చ:ఈ నెల 6వ తేదీతో జడ్చర్ల మున్సిపల్ పాలకవర్గం గడువు ముగియడం, 7వ తేదీ నుండి ప్రత్యేక అధికారిగా (స్పెషల్ ఆఫీసర్) జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. మున్సిపల్ పాలకవర్గం గడువు ముదిగిసిన కొద్దిరోజులకే, స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ప్రారంభమైన తొలి వారంలోనే ఈ స్థాయిలో ఏసీబీ దాడులు జరగడం నియోజకవర్గవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి: ఏసీబీ డీఎస్పీ ప్రభుత్వాధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ధైర్యంగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు లేదా వాట్సాప్ మరియు సోషల్ మీడియా వేదికల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రస్తుతం తనిఖీలు, రికార్డుల వెరిఫికేషన్ కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలను ఉన్నతాధికారుల అనుమతితో నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.

