మారిన వాతావరణం, తీవ్ర నష్టం
జడ్చర్ల, మే 24 (జనంసాక్షి): ఆదివారం సాయంత్రం జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది.
అప్పటివరకు సాధారణంగా ఉన్న వాతావరణం క్షణాల్లోనే చీకటిగా మారి, వానతో పాటు వీచిన బలమైన గాలులు పట్టణాన్ని అతలాకుతలం చేశాయి. ఈ హఠాత్ పరిణామానికి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలివాన తీవ్రతకు పట్టణంలోని పలు ప్రధాన రహదారులపై, కాలనీలలో పాత చెట్లు, పెద్ద పెద్ద కొమ్మలు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల హోర్డింగులు, ఫ్లెక్సీలు గాల్లోకి లేచిపోయాయి. బలమైన గాలుల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడటం, స్తంభాలు వంగిపోవడంతో జడ్చర్ల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై చెట్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రైతుల్లో ఆందోళన:ఈ అకాల గాలివాన స్థానిక రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. చేతికొచ్చిన పంటలు, ఆరబోసిన ధాన్యం తడిసిముద్దవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలుచోట్ల ఇళ్లపై రేకులు కొట్టుకు పోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

