ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శివకాంత్
జడ్చర్ల, మే 24 (జనంసాక్షి): జడ్చర్ల పట్టణంలోని నిమ్మబాయి గడ్డ ప్రాంతంలో స్వైన్ ఫ్లూ అనుమానిత కేసు వెలుగుచూడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. శనివారం జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శివకాంత్, ఎపిడెమాలజిస్ట్ యుగంధర్ సంయుక్తంగా బాధితుడి గృహాన్ని సందర్శించారు. అనంతరం స్వైన్ ఫ్లూ నిర్ధారణ కోసం శాంపిల్‌ను సేకరించి హైదరాబాద్‌లోని ఐపీఎం ల్యాబ్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది నిమ్మబాయి గడ్డ పరిసరాల్లోని 50 ఇళ్లలో ముమ్మర సర్వే నిర్వహించారు.
స్థానికులలో ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు ఉన్నాయా అని తనిఖీ చేయగా, ఎవరికీ ఎలాంటి లక్షణాలు లేవని తేలింది. జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శివకాంత్ మాట్లాడుతూ ప్రజలు ఎవరు కూడా భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో పట్టణ వైద్యాధికారి డాక్టర్ మను ప్రియ, ఎం.ఎల్.హెచ్.పి డాక్టర్ సుచరిత, ఏఎన్ఎం భాగ్యమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

