Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోతుల బెడద. వీధి కుక్కల బీభత్సం

కోతుల బెడద. వీధి కుక్కల బీభత్సం

భూదాన్ పోచంపల్లి, మే 5 (జనం సాక్షి): మండలంలోని గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలో కోతులు, వీధి కుక్కల సంచారం రోజురోజుకు పెరుగుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

అడవుల్లో ఉండాల్సిన జంతువులు నివాస ప్రాంతాల్లోకి చేరి స్థానికుల నిత్యజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, ఉదయం నడకకు వెళ్లే వృద్ధులు, ఇళ్ల పనుల్లో నిమగ్నమయ్యే గృహిణులు సైతం బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది.

కోతుల బెడదగ్రామాలు, కాలనీల్లో కోతుల సంచారం అధికమై ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను చెదరగొట్టడం, ఫ్రిజ్‌లను తెరిచి ఆహారాన్ని ధ్వంసం చేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. నీటి పైపులు, ఇంటి సామగ్రిని పాడుచేయడం కూడా సాధారణమైంది. చిన్నారులపై దాడులకు వెనుకాడకపోవడం స్థానికులను మరింత భయపెడుతోంది.

వీధి కుక్కల బీభత్సం

మరోవైపు వీధుల్లో కుక్కల గుంపులు స్వేచ్ఛగా తిరుగుతూ ప్రజలకు ముప్పుగా మారుతున్నాయి. కుక్కల దాడుల్లో పలువురు గాయపడుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. గత మార్చి నెలలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని తారకరామ నగర్‌లో నాలుగేళ్ల బాలుడిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాలుడు ఒక కన్ను కోల్పోయాడు.

చికిత్స కేసులు పెరుగుతున్నాయి

పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదవుతున్న కేసులు పరిస్థితి తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, 2025 సంవత్సరంలో 470 కుక్క కాటు కేసులు, 185 కోతి దాడి కేసులు నమోదయ్యాయి. 2026లో ఏప్రిల్ వరకు మాత్రమే 132 కుక్క కాటు కేసులు, 83 కోతి దాడి కేసులు నమోదు కావడం పరిస్థితి వేగంగా విషమిస్తున్నదని సూచిస్తోంది.

చర్యలు తీసుకోవాలి

కోతులు, వీధి కుక్కల సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోతులను అటవీ ప్రాంతాలకు తరలించడం, వీధి కుక్కల సంఖ్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కుక్క కాటు లేదా కోతి దాడి జరిగినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గాయాన్ని శుభ్రం చేసి రేబీస్ టీకా తీసుకోవాలి. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం కలగవచ్చు.
- డా. శ్రీవాణి, మండల వైద్యాధికారిణి

వీధి కుక్కలతో పాటు కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. గుంపులుగా తిరిగే కుక్కలు చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తుండగా, కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహారం తీసుకెళ్లడం, వస్తువులను ధ్వంసం చేయడం వంటి ఘటనలు పెరిగాయి. ఉదయం, సాయంత్రం బయటకు వెళ్లడానికే భయపడుతున్నాం. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రజలకు భద్రత కల్పించాలి.
- గోశిక భానుప్రకాష్, భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ

గ్రామాల్లో కోతుల బెడద మరింత తీవ్రంగా మారింది. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్లడమే కాకుండా, నీటి పైపులు, ఇంటి సామగ్రిని ధ్వంసం చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. సమస్య మరింత పెరగకముందే అధికారులు స్పందించి కోతులను బంధించి అడవుల్లోకి తరలించాలి.
- బిజిలీ ఎల్లయ్య, భీమనపల్లి గ్రామం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi