ఆటోకు తాడు కట్టి లాగుతూ సీపీఐ వినూత్న నిరసన
పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి
-సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
చేర్యాల (జనంసాక్షి) మే18: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ చేర్యాల మండల కేంద్రంలో అంగడి బజార్ చౌరస్తా వద్ద ఆదివారం సీపీఐ నాయకులు ఆటోకు తాడుకట్టి లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
ఈసందర్భంగా సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గసభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 13 సంవత్సరాల కాలంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపడంతో రైతులు, కూలీలు, కార్మికులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో మధ్యతరగతి, పేద ప్రజల జీవనం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, లేదంటే దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, మండల కోశాధికారి నంగి కనకయ్య, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు సుంకోజు రజిత, మండల కార్యవర్గ సభ్యులు మనేపల్లి కిష్టయ్య, సిద్దిరాం భద్రయ్య,మల్లం గిరీష్, మల్లయ్య, పోషయ్య, రాజవ్వ, ప్రమీల, కనకవ్వ, తదితరులు పాల్గొన్నారు.

