Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్‌లో పోలీసుల ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం

ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్‌లో పోలీసుల ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం

ప్పల్ మే 21 ( జనం సాక్షి ):ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్‌లో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో "మీ సురక్ష - మీ భద్రతే మా ప్రాధాన్యత" అనే నినాదంతో ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు రాయల్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కాలనీవాసులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను పోలీసు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.ప్రస్తుతం నగర పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న నేరాలు, చోరీలు, ఆకతాయిల వేధింపులు, సైబర్ మోసాల నేపథ్యంలో ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప్పల్ ఏసీపీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీల్లో నివసించే ప్రతి కుటుంబం తమ పరిసరాల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా రెంటర్లు, గృహ కార్మికులు (డొమెస్టిక్ వర్కర్స్), సెక్యూరిటీ గార్డ్స్ మరియు ఇతర సేవా సిబ్బంది పూర్తి వివరాలను పోలీస్ శాఖ రూపొందించిన ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఈ సమాచారం నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి అనుమానాస్పద సంఘటనలు జరిగినా త్వరగా విచారణ జరిపి సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుందని తెలిపారు. ప్రతి అపార్ట్‌మెంట్, ప్రతి కాలనీ పోలీస్ శాఖతో సమన్వయం కలిగి ఉంటే నేరాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.ఈ సందర్భంగా భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కాలనీలో నెలకొన్న పలు సమస్యలను ఏసీపీ దృష్టికి తీసుకువచ్చారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆకతాయిల గుంపులు తిరగడం, బైక్ రైడర్లు అధిక వేగంతో హల్‌చల్ చేయడం, రోడ్లపై మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం వల్ల మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొంతమంది యువకులు అర్ధరాత్రి వరకు పెద్ద శబ్దాలతో వాహనాలు నడపడం వల్ల ప్రశాంత వాతావరణం దెబ్బతింటోందని వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యలపై స్పందించిన ఏసీపీ వెంకట్ రెడ్డి, కాలనీలో ప్రత్యేక పహారా బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి సమయంలో మరింత నిఘా పెంచుతామని హామీ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే సీసీ కెమెరాల ఏర్పాటు, బీట్ పోలీసింగ్ బలోపేతం వంటి చర్యలు కూడా చేపడతామని తెలిపారు.అదేవిధంగా ప్రజలు కూడా ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ కాల్స్ వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ప్రజలకు పలు భద్రతా సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో డి.ఐ రవికుమార్, ఉప్పల్ ఎస్సై మాధవ రెడ్డి, భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, అపార్ట్‌మెంట్ ప్రతినిధులు, మహిళలు, యువత, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కాలనీవాసులు పోలీస్ శాఖ చేపడుతున్న భద్రతా చర్యలను అభినందించారు."ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యం" అని పోలీసులు పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi