Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీరమాత వేదమ్మ కన్నుమూత

వీరమాత వేదమ్మ కన్నుమూత

కుటుంబాన్నే ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన త్యాగమూర్తి

భౌతికకాయాన్ని గద్వాల వైద్య కళాశాలకు దానం

నంసాక్షి, గద్వాల : ప్రజా ఉద్యమాలకు, సామాజిక చైతన్యానికి తన కుటుంబాన్నే అంకితం చేసిన వీరమాత వేదమ్మ (86) మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేట్‌లో తన కుమార్తె జ్యోతి నివాసంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు.

ఆమె మృతి పట్ల ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమకారులు, బంధుమిత్రులు, గద్వాల ప్రజలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వేదమ్మ భర్త దివంగత బన్నూరు రామిరెడ్డి (ఎల్‌ఐసీ రామిరెడ్డి) ఎమర్జెన్సీ కాలం నుంచే అభ్యుదయ భావాలతో ప్రజల్లో చైతన్యం నింపిన ప్రముఖ ఉద్యమకారుడు. విద్యార్థులు, యువతలో సామాజిక స్పృహ పెంపొందించేందుకు విశేషంగా కృషి చేసి తెలంగాణలో తొలి తరం విప్లవ భావజాలాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ దంపతులు తమ కుటుంబ సభ్యులను కూడా ప్రజా సేవ, ఉద్యమాల బాటలో నడిపించారు. పెద్ద కుమార్తె సుగుణ (హరిత) విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పనిచేసి అనంతరం పూర్తికాల ఉద్యమ కార్యకర్తగా నల్లమల్ల, మెదక్ ప్రాంతాల్లో సేవలందించారు. మెదక్ జిల్లా కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె పల్నాడు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరులయ్యారు.

రెండో కుమార్తె జ్యోతి చైతన్య మహిళా సంఘం నాయకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పురుషోత్తంను 2001లో నయీమ్ ముఠా దారుణంగా హత్య చేసింది. కుమారుడు కొండారెడ్డి ప్రజా న్యాయవాదిగా ప్రజలకు న్యాయసేవలు అందిస్తుండగా, మరో కుమార్తె విజయ మహంతి సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆమె చిన్నల్లుడు మహంతి వెంకట్ రావు సామాజిక స్పృహ కలిగిన పాత్రికేయుడు.

మరణానంతరం కూడా సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పంతో వేదమ్మ భౌతికకాయాన్ని గద్వాల ప్రభుత్వ వైద్య కళాశాలకు వైద్య విద్యార్థుల అధ్యయనం, పరిశోధనల కోసం దానం చేయడం ఆమె కుటుంబం సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది. ప్రజా ఉద్యమాలకు ప్రేరణగా నిలిచిన వేదమ్మ మరణం గద్వాల ప్రాంతానికే కాక తెలంగాణ ప్రజా ఉద్యమ వర్గాలకు తీరని లోటని పలువురు ప్రముఖులు, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పిస్తూ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi