గడ్డిని కాల్చేందుకు వెళ్లాడుచేనులోనే సజీవ దహనమయ్యాడు
కాపాడేందుకు వెళ్లిన భార్య పరిస్థితి విషమం
రేపాకపల్లెలో తీవ్రవిషాదం
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో/రేగొండ, (జనంసాక్షి): "పిల్లలందరినీ ఒక ఇంటివాళ్లను చేశా.
ఇక నా బాధ్యత తీరిపోయింది" అని చెప్పుకునే వయసులో ఆ రైతుకు మృత్యువు పంట చేనులోనే ఎదురైంది. వరిగడ్డి తగలబెడితే భూమి పదునవుతుందని నమ్మి నిప్పు అంటించాడు. కానీ అదే మంటలు క్షణాల్లో అతని ప్రాణాలను చిదిమేశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లెలో శుక్రవారం జరిగిన ఈ ఘటన గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది.
గ్రామానికి చెందిన చాగర్ల చంద్రమౌళి (60) వ్యవసాయమే జీవనాధారం. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకును కని పెంచి, ముగ్గురికీ పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించాడు. భార్య భాగ్యతో కలిసి ఇద్దరే ఉంటూ పొలం పనులు చేసుకుంటున్నారు. శుక్రవారం పొలంలో వరిగడ్డి తగలబెట్టేందుకు ఇద్దరూ చేనుకు వెళ్లారు.
గడ్డికి నిప్పు పెట్టగానే ఒక్కసారిగా గాలికి మంటలు విస్తరించాయి. తప్పించుకునేలోపే చంద్రమౌళి మంటల్లో చిక్కుకున్నాడు.కళ్లెదుటే భర్త మంటల్లో కాలిపోతుంటే భాగ్య గుండెలు బాదుకుంది. అతన్ని బయటకు లాగేందుకు వెళ్లి ఆమె కూడా మంటల ధాటికి కాలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కేకలు విన్న చుట్టుపక్కల రైతులు పరుగున వచ్చి మంటలు ఆర్పి భాగ్యను ఆసుపత్రికి తరలించారు.
కానీ అప్పటికే చంద్రమౌళి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. "ఆయన చాలా మంచోడు. ఎవరికీ అపకారం తలపెట్టడు. పిల్లలందరినీ సెటిల్ చేసి, ఇక హాయిగా బతుకుదామనుకునే టైంలో ఇలా జరగడం దారుణం" అంటూ గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.
భర్త మృతి, తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో బిడ్డలు శోకసంద్రంలో మునిగిపోయారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భాగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వాలు వరిగడ్డి తగలబెట్టవద్దని, యంత్రాలతో తొలగించాలని చెబుతున్నా, చిన్న రైతులకు అవి అందుబాటులో లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రమౌళి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

