వార్తలు
గల్వాన్ లోయలో కవ్వింపులు చైనా ప్లాన్ ప్రకారమే జరిగాయనడానికి ఆధారాలు: అమెరికా ప్యానెల్

తూర్పు లఢాక్‌లోని గల్వాన్ లోయలో ఈ ఏడాది జూన్‌లో ఇండియా, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇండియాలోకి చొరబడుతున్న చైనా సైనికులను అడ్డుకోవడానికి భారత జవాన్లు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సందర్భంగా చైనా సైనికులు జరిపిన దాడిలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. అయితే చైనా ప్రభుత్వం పక్కా ప్లాన్ ప్రకారమే ఈ పని చేసిందని తాజాగా అమెరికాకు చెందిన ప్యానెల్ ఒకటి తన వార్షిక నివేదికలో ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ - చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ రీవ్యూ కమిషన్ (యూఎస్‌సీసీ) ఈ రిపోర్ట్ ఇచ్చింది.
గల్వాన్ లోయలో కవ్వింపులు చైనా ప్రభుత్వ ప్లాన్ ప్రకారమే జరిగాయనడానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని, భారత జవాన్లపై దాడి కూడా ఇందులో ఒక భాగం కావచ్చని ఆ నివేదిక స్పష్టం చేసింది.
ఈ యూఎస్‌సీసీ 2000వ సంవత్సరంలో ఏర్పాటైంది. ఇది అమెరికా, చైనా మధ్య తలెత్తే భద్రత, వాణిజ్య సమస్యలపై దర్యాప్తు చేస్తుంది. అయితే చైనా ప్రభుత్వం ఇలా చేయడానికి కచ్చితమైన కారణం ఏంటన్నది తెలియకపోయినా.. సరిహద్దులో ఉన్న బలగాల కోసం భారత్ రోడ్డును నిర్మించడం ఒక కారణం కావచ్చని ఆ కమిషన్ చెబుతోంది. ఈ ఘటన జరగడానికి కొన్ని వారాల ముందు చైనా రక్షణ మంత్రి చేసిన దుందుడుకు వ్యాఖ్యలు, అక్కడి అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ చేసిన హెచ్చరికలను ఈ కమిషన్ ప్రస్తావించింది.
భారత్‌తో ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు సరిహద్దులో చైనా కుట్రలకు పాల్పడుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఇటు డోక్లాంకు సమీపంలో భూటాన్ భూభాగంలో ఇప్పటికే ఒక గ్రామం, రోడ్డు నిర్మించిన చైనా.. ఇప్పుడు రెండో గ్రామాన్ని కూడా నిర్మించడానికి సిద్ధమవుతోంది. మరోవైపు బ్రహ్మపుత్ర నదిపై డ్యాం నిర్మిస్తోంది. ఇవన్నీ భారత్‌ను కవ్వించేందుకు చేస్తున్న చర్యలే. ఈ ఏడాది కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్నా.. చైనా మాత్రం ఇండియాతోపాటు ఇతర దేశాలనూ ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ ఏడాది ఇండియాతోపాటు జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్, యూకే, కెనడాలతోనూ చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది.
related stories
-
జాతీయం-అంతర్జాతీయం చైనా దుర్బుద్ధిపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
-
జాతీయం-అంతర్జాతీయం చైనా పోర్టు నుంచి 7 నెలల తర్వాత.. భారత్‌కు 23 మంది నావికా సిబ్బంది
-
అభిప్రాయం అణ్వస్త్ర రహిత ప్రపంచం