హైదరాబాద్: ప్రజా సేవలో అంకితభావం, నిజాయితీతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు సూచించారు. సోమవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్-1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు సంస్థ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శాంతి కుమారి ఆధ్వర్యంలో లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా అధికారులను అభినందించిన గవర్నర్ మాట్లాడుతూ, ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని అన్నారు. పరిపాలనలో నిజాయితీ అత్యంత కీలకమని, అది ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడి సమస్యను సున్నితంగా అర్థం చేసుకుని పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారుల పై ఉందన్నారు.
"పదవి అనేది కేవలం అధికారం మాత్రమే కాదు, అది ఒక బాధ్యత" అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, సమాజ పురోగతిలో అధికారులు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, సంయుక్త కార్యదర్శి శశికిరణాచారి పాల్గొన్నారు.

