Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చైనాలో ట్రంప్ పర్యటన..తైవాన్ అంశంపై 'రెడ్ లైన్' దాటొద్దని హెచ్చరిక!

చైనాలో ట్రంప్ పర్యటన..తైవాన్ అంశంపై 'రెడ్ లైన్' దాటొద్దని హెచ్చరిక!

maa gulf 1 week ago

బీజింగ్‌: ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాల మధ్య దౌత్యపరమైన పోరు మరోసారి పరాకాష్టకు చేరింది. చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

బీజింగ్‌లోని 'గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్'లో జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో తైవాన్ అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

తైవాన్ విషయంలో యుద్ధ హెచ్చరిక

తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని చైనా తీవ్రంగా పరిగణించింది. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ, "తైవాన్ మా అంతర్భాగం. ఇది మా ప్రాథమిక ప్రయోజనాలకు సంబంధించిన విషయం. ఇక్కడ అమెరికా 'రెడ్ లైన్' దాటితే అది కేవలం దౌత్య వైఫల్యానికే పరిమితం కాదు, ఇరు దేశాల మధ్య యుద్ధానికి (War) దారి తీస్తుంది" అని కుండబద్దలు కొట్టారు. తైవాన్ స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించే చర్యలు చేపడితే అగ్రరాజ్యం పెను సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.దీనిపై తైవాన్ స్పందిస్తూ.. ప్రాంతీయ శాంతిని దెబ్బతీస్తున్నది చైనాయేనని విమర్శలు గుప్పించింది.

ఇరాన్ అణ్వస్త్రాల విషయంలో ఏకాభిప్రాయం

తైవాన్ విషయంలో విభేదాలు ఉన్నప్పటికీ, ఇరాన్ వ్యవహారంలో మాత్రం ఇద్దరు నేతలు ఒకే తాటిపైకి వచ్చారు.ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదని ట్రంప్, జిన్‌పింగ్ నిర్ణయించుకున్నారు.ఇరాన్‌కు చైనా ఎటువంటి సైనిక సామగ్రిని సరఫరా చేయబోదని జిన్‌పింగ్ హామీ ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు.అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన 'హర్మూజ్ జలసంధి'ని ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయకూడదని, అక్కడ స్వేచ్ఛా వాణిజ్యం కొనసాగాలని ఇరువురు నేతలు తీర్మానించారు.

ఈ పర్యటనలో భద్రతాపరమైన అంశాలతో పాటు ఆర్థిక సంబంధాలపైనా కీలక చర్చలు జరిగాయి.భవిష్యత్తులో ఇంధనం కోసం అమెరికా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసేందుకు చైనా ఆసక్తి కనబరిచింది.అమెరికాలో చైనా పెట్టుబడులను ప్రోత్సహించడం, చైనా మార్కెట్లలో అమెరికా కంపెనీలకు ప్రవేశం కల్పించడం పై శ్వేతసౌధం సానుకూల ప్రకటన చేసింది.వాషింగ్టన్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచాలన్న అమెరికా ప్రతినిధుల కోరికకు జిన్‌పింగ్ సానుకూలంగా స్పందించారు.దశాబ్దం తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనా గడ్డపై అడుగుపెట్టిన ఈ పర్యటన, ఒకవైపు యుద్ధ హెచ్చరికలు.. మరోవైపు వాణిజ్య ఒప్పందాల కలయికగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu