న్యూ ఢిల్లీ: ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. వరంగల్ మామునూరు విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి రాబోయే రెండు వారాల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా, అంతా అనుకున్నట్లు జరిగితే రాబోయే డిసెంబర్ నెలలోనే విమానాశ్రయ నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఓరుగల్లు నగరం పారిశ్రామికంగా, రవాణా పరంగా తీవ్ర పురోగతి సాధిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

