కువైట్: కువైట్ రహదారులపై వేగ పరిమితిని ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు తన "X" ప్లాట్‌ఫామ్‌లో ఒక ప్రకటన జారీ చేసింది.
గంటకు 150 కిలోమీటర్లకు మించి వేగంతో వాహనం నడుపుతూ పట్టుబడిన పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘన మరియు వాహన జప్తును ఎదుర్కొంటారని, అదే ప్రవాసులు అయితే ట్రాఫిక్ ఉల్లంఘన, వాహన జప్తుతోపాటు దేశ బహిష్కరణను ఎదుర్కొంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
గంటకు 170 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లే పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘన, వాహన జప్తు మరియు వాహనాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటామని, ప్రవాసులపై ట్రాఫిక్ ఉల్లంఘన, వాహన జప్తు మరియు దేశ బహిష్కరణ వేటు పడుతుందని తెలిపింది.
గంటకు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వాహనాలు నడిపే పౌరులకు ట్రాఫిక్ ఉల్లంఘన, వాహనం జప్తు మరియు జైలు శిక్ష విధిస్తామని, ప్రవాసులకు మాత్రం ట్రాఫిక్ ఉల్లంఘన, వాహనం జప్తు మరియు దేశ బహిష్కరణ ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

