ఎవరెస్ట్ శిఖరం పై ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వైపు తిరిగి వస్తుండగా ఇద్దరు భారతీయ పర్వతారోహకులు మృతి చెందారు.
ఈ విషయాన్ని నేపాల్ అధికారులు వెల్లడించారు. మృతులు ఒకరు అరుణ్ కుమార్ తివారీ, మరొకరు సందీప్‌గా గుర్తించారు.
తాజాగా బుధవారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు 274 మంది పర్వతారోహకుల టీమ్. అందులో ఇండియాకు చెందిన సందీప్ ఆరే, తులసి రెడ్డి, అజయ్ పాల్ సింగ్ తోపాటు మరో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు నేపాల్ ఎక్స్‌పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ తెలియజేసింది. ఒక రోజులో అధిక సంఖ్యలో ఎవరెస్ట్‌ను అధిరోహించిన టీమ్‌గా కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. అయితే, అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరే కిందకు దిగుతున్న సమయంలో తీవ్రంగా అలసిపోయారని తెలిపారు. వారిని రక్షించేందుకు గైడ్స్ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరణించినవారు వేర్వేరు బృందాల్లో సభ్యులు. బుధవారం ఒకరు, గురువారం మరొకరు మృత్యువాత పడ్డారు. ఒకరు దిగుతున్న సమయంలో ప్రాణాలు కోల్పోగా, మరొకరు బేస్ క్యాంప్‌కు వచ్చినప్పుడు తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలియగానే వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వీరికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

