హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి (NH-65) ని ఆరు లేన్లుగా విస్తరించే దిశగా కీలక పురోగతి లభించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సమర్పించిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వ పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ (PPPAC) ఆమోదం తెలిపింది.
ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) తుది ఆమోదం పొందిన వెంటనే టెండర్లు, భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. మొత్తం 284 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ, భూసేకరణ మరియు నిర్మాణ వ్యయాల కోసం దాదాపు రూ. 12,000 కోట్లు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టును ప్రధానంగా మూడు ప్యాకేజీలలో అమలు చేయనున్నారు: మల్కాపూర్ నుంచి విజయవాడ గొల్లపూడి బైపాస్ వరకు 226 కి.మీ మార్గాన్ని నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా విస్తరిస్తారు. దీనిని బిఓటి (Build-Operate-Transfer) విధానంలో రెండు ప్యాకేజీలుగా (హైదరాబాద్ నుంచి నందిగామ, నందిగామ నుంచి గొల్లపూడి) చేపడతారు.ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్లను అలాగే ఉంచి, ఇరువైపులా కొత్తగా సర్వీస్ రోడ్లను నిర్మిస్తారు.అమరావతి ఔటర్ రింగ్ రోడ్ క్రాసింగ్ పాయింట్ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న 44 కి.మీ మార్గాన్ని 'హైబ్రిడ్ యాన్యుటీ మోడల్' (HAM) కింద ఒకే ప్యాకేజీగా ఆరు లేన్లుగా విస్తరిస్తారు.
ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి-భవానీపురం పొడిగింపు నిరాకరణ
ప్రారంభంలో కంచికచర్ల వరకే ఉన్న విస్తరణ ప్రతిపాదనను విజయవాడ బైపాస్ (గొల్లపూడి) వరకు పొడిగించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. దీంతో విస్తరణను గొల్లపూడి వరకు పొడిగించారు. అయితే, గొల్లపూడి నుంచి భవానీపురం కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు అదనంగా కోరిన 5 కి.మీ విస్తరణ ప్రతిపాదనకు పీపీపీఏసీ ఆమోదం లభించలేదు. విజయవాడ-మచిలీపట్నం మార్గంలో బెంజ్ సర్కిల్ నుంచి ఇడుపుగల్లు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలనే ప్రాథమిక ప్రతిపాదనను పీపీపీఏసీ తిరస్కరించింది. ఈ ప్రాంతంలో ఎలివేటెడ్ బ్రిడ్జ్‌కు బదులుగా సర్వీస్ రోడ్ల నిర్మాణానికే మొగ్గు చూపారు.

