మనామా: తమ దేశంపై ఇరాన్ మరోసారి దాడులకు పాల్పడిందని బహ్రెయిన్ ఐక్యరాజ్యసమితి (UN)కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నవంబర్ 19న ఐరాస ప్రధాన కార్యదర్శికి, భద్రతా మండలి అధ్యక్షుడికి ఒకే సమాచారంతో కూడిన రెండు లేఖలను పంపించింది.
అంతకుముందు నవంబర్ 13, 15 తేదీల్లోనూ దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడులను వెంటనే, ఎలాంటి షరతులు లేకుండా నిలిపివేయాలని ఐరాస భద్రతా మండలి తీర్మానం 2817 (2026)లో పిలుపునిచ్చినప్పటికీ దాడులు కొనసాగడం ఆందోళన కలిగిస్తోందని వివరించింది.
బహ్రెయిన్ పంపిన తాజా లేఖలను భద్రతా మండలి అధికారిక పత్రం S/2026/924గా ప్రచురించింది. అంతకుముందు నవంబర్ 16న పంపిన లేఖ S/2026/911గా నమోదైంది. మరోవైపు, ఇరాన్ నుంచి వచ్చిన పలు వైమానిక దాడులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు లక్ష్యాలను చేరకముందే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్ వెల్లడించింది. ప్రజలు, నివాసితులు సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.
ఈ దాడులు తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే కాకుండా, ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా పరిణమించాయని బహ్రెయిన్ మండిపడింది. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 2(4)తో పాటు అంతర్జాతీయ చట్టాలు, పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలకు సంబంధించిన సూత్రాలను కూడా ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలని బహ్రెయిన్ కోరింది.

