Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత

పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత

maa gulf 3 weeks ago

స్కిల్ యూనివర్సిటీల్లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి

ఏటీసీల్లో అత్యాధునిక కోర్సులకు ప్రాధాన్యం
డిమాండ్‌కు తగినట్లు నర్సింగ్ కళాశాలల ఏర్పాటు

క్తి శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతో పాటు ఉద్యోగార్ధులకు అవసరమైన పాస్‌పోర్టు, ఆయా దేశాల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టామ్‌కాం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. శక్తి శాఖపై ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్య ప్రాచ్య దేశాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బందిపడుతున్నారని సీఎం తెలిపారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్‌పోర్టులు ఇప్పించడంతో పాటు వారు వెళ్లే దేశాల్లోని మ్యాన్ పవర్ కంపెనీలతో ఒప్పందాలను టామ్‌కాం చేసుకోవాలని సీఎం సూచించారు. విదేశీ కంపెనీలతో టామ్‌కాం ఒప్పందం చేసుకోవడం ద్వారా అక్కడకు వెళ్లిన వారికి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే చర్చలు జరపడానికి, వారికి న్యాయం చేయడానికి వీలుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. కార్మికులను విదేశాలకు తరలించే ఏజెంట్ల వివరాలు సేకరించి.. వారు పంపించే ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేయాలని సీఎం సూచించారు. ఈ వ్యవహారాల పర్యవేక్షణకు టామ్‌కాంకు మాజీ ఐఎఫ్ఎస్ అధికారిని సీఈవోగా నియమిస్తామని సీఎం తెలిపారు. ఉద్యోగార్దులకు లైట్ మోటార్ వెహికల్‌, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌లోనూ శిక్షణ ఇప్పించాలని సీఎం సూచించారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలకు అవసరమైన రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జర్మనీ, జపనీస్‌, కొరియన్‌, చైనీస్‌, రష్యన్ తదితరు భాషలు నేర్చుకునేందుకు వీలుగా స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలన్నారు. విదేశీ భాషలు నేర్పేందుకు స్థానికంగా ఆ భాషలో పట్టున్న వారితో పాటు ఆయా దేశాలకు చెందిన శిక్షకులను రప్పించాలని సీఎం అన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో రీలొకేటెడ్ చెట్లను నాటాలని సీఎం సూచించారు. ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు ఇచ్చినట్లే, బ్లూ కాలర్ జాబ్‌లకు శిక్షణ పొందేవారందరికీ స్కాలర్‌షిప్‌లు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు పెద్ద కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓ వైపు చదువుకుంటూనే, మరో వైపు ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా వారికి స్టైఫండ్ లభిస్తుందని, భవిష్యత్‌లో చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకుంటారన్నారు. ఏటీసీల్లో EV సర్వీసులకు సంబంధించిన కోర్సులు, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలని సీఎం సూచించారు. ఈవీల వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వాటి సర్వీసింగ్ చేయగలిగిన వారు అవసరమన్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం భారీగా పెరుగుతున్నందున డ్రోన్ టెక్నాలజీ కోర్సు ఉండాలని సీఎం సూచించారు.

దేశీయంగానూ, విదేశాల్లోనూ నర్సుల సేవలకు భారీ డిమాండ్ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో ఇంటికో నర్సు డిమాండ్ ఉందన్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నర్సింగ్ కళాశాలలకు అనుమతులు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్‌.శ్రీధర్‌, శక్తి కార్యదర్శి హరిచందన, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ నిర్మలా కాంతి వెస్లీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu