మస్కట్: వ్యక్తుల వ్యక్తిగత లేదా కుటుంబ జీవితానికి సంబంధించిన వార్తలు, ఫోటోలు లేదా వ్యాఖ్యలను వారి అనుమతి లేకుండా ప్రచురించడం నేరమని ఒమన్ సుల్తానేట్‌లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.
తన '#MissingLink ప్రచారం'లో భాగంగా జారీ చేసిన ఒక ప్రకటనలో.. సంబంధిత వ్యక్తుల ఆమోదం లేకుండా అటువంటి సమాచారాన్ని పంచుకుంటే ఏడాది వరకు జైలు శిక్ష పడొచ్చని పేర్కొంది. వివిధ రకాల ప్రచురణల ద్వారా వ్యక్తిగత గోప్యత మరియు కుటుంబ జీవిత ఉల్లంఘనలను నేరంగా పరిగణించే శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 330ను ఈ సంస్థ ఉదహరించింది.
గోప్యతా హక్కులను గౌరవించడంపై అవగాహన కల్పించడం, సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ ప్రచారం లక్ష్యం. డిజిటల్ బెదిరింపులు ఒమన్ సైబర్‌క్రైమ్ చట్టం ప్రకారం నేరమని తెలిపింది.వ్యక్తులను బెదిరించడానికి లేదా వారి నుండి డబ్బు వసూలు చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలనుసంస్థ హైలైట్ చేసింది. ప్రైవసిని పరిరక్షించడానికి కఠినమైన శిక్షలు అమలులో ఉన్నాయని కూడా పేర్కొంది.

