Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రముఖ సీనియర్ నిర్మాత కే రజన్ ఆత్మహత్య!

ప్రముఖ సీనియర్ నిర్మాత కే రజన్ ఆత్మహత్య!

maa gulf 1 week ago

మిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్‌లో సీనియర్ నిర్మాత, దర్శకుడు మరియు సినీ విశ్లేషకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కె.రజన్ ఆదివారం సాయంత్రం చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు.

85 ఏళ్ల వయసులో ఆయన తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయం యావత్ సౌత్ సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది.

అడయార్ నదిలోకి దూకి ఆత్మహత్య

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆదివారం సాయంత్రం నిర్మాత రజన్ తన డ్రైవర్‌తో కలిసి కారులో చెన్నైలోని అడయార్ ప్రాంతానికి చేరుకున్నారు. తిరు-వి-క (Thiru-Vi-Ka) వంతెన సమీపంలో కారు ఆపమని డ్రైవర్‌కు చెప్పి, కాసేపు వాకింగ్ చేసి వస్తానని వెళ్లారు. వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన ఆయన, ఒక్కసారిగా కింద ఉన్న అడయార్ నదిలోకి దూకేశారు.

గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. అడయార్ పోలీసులు, సైదాపేట ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం రజన్ మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్‌మార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

కోలీవుడ్‌లో చెరగని ముద్ర

1980వ దశకం నుండి తమిళ చిత్ర పరిశ్రమలో కె. రజన్ చురుగ్గా కొనసాగుతున్నారు. గణేష్ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై 1983లో సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన 'బ్రమ్మచరిగల్' సినిమాతో ఆయన నిర్మాతగా ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 'డబుల్స్', 'అవళ్ పావం' వంటి పలు చిత్రాలను నిర్మించారు. కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా 1991లో నిలాల్గల్ రవి, శరత్‌కుమార్ నటించిన 'నమ్మ ఊరు మరియమ్మ' సినిమాకు మరియు 2005లో 'ఉడర్చిగల్' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. నటుడిగానూ అజిత్ కుమార్ 'తునివు', సెల్వరాఘవన్ 'బకాసురన్' చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. ఆయన కుమారుడు ప్రభుకాంత్ కూడా తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా (ఎల్కేజీ సినిమా డైరెక్టర్) రాణిస్తున్నారు.

సినీ ఈవెంట్లలో, ఆడియో లాంచ్‌లలో చిత్ర పరిశ్రమలోని సమస్యలపై, నటీనటుల భారీ రెమ్యునరేషన్లపై ఎంతో నిర్భయంగా, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా రజన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన హఠాన్మరణం పట్ల కోలీవుడ్ ప్రముఖులు, నిర్మాతల మండలి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu