దోహా: ప్రాంతీయ ఉద్రిక్తతలు, 2026 మొదటి త్రైమాసికం (Q1) చివరిలో వినియోగదారుల కార్యకలాపాలు మందగించినప్పటికీ, ఖతార్ రిటైల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగానే ఉందని వాల్యూస్ట్రాట్ తన తాజా డేటాలో పేర్కొంది.
ఖతార్‌లో మొత్తం రిటైల్ సరఫరా 5.7 మిలియన్ చదరపు మీటర్ల గ్రాస్ లీజబుల్ ఏరియా (GLA)గా ఉందని, ఇందులో ఆర్గనైజ్డ్ రిటైల్ వాటా 2.5 మిలియన్ చదరపు మీటర్లు మరియు అన్ ఆర్గనైజ్డ్ రిటైల్ స్థలాలు 3.2 మిలియన్ చదరపు మీటర్లు ఉన్నాయని నివేదిక తెలిపింది.
దేశవ్యాప్తంగా జరిగిన అనేక ప్రధాన కార్యక్రమాలు మరియు ప్రదర్శనల మద్దతుతో త్రైమాసికం ప్రారంభంలో రిటైల్ కార్యకలాపాలు విస్తరించాయని వాల్యూస్ట్రాట్ పేర్కొంది. వీటిలో ఖతార్ అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్, ఊరెడూ వారి దోహా మారథాన్, వెబ్ సమ్మిట్ ఖతార్, మ్యాచ్ ఫర్ హోప్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వినియోగదారుల రాకపోకలు మరియు రిటైల్ ఖర్చులను పెంచడానికి దోహదపడ్డాయని నివేదిక పేర్కొంది.
ఈ త్రైమాసికంలో అనేక కొత్త అంతర్జాతీయ మరియు ప్రాంతీయ రిటైల్ బ్రాండ్‌లు కూడా మార్కెట్లోకి ప్రవేశించాయి. లండన్‌కు చెందిన సూపర్‌నోవా సెంట్రో మాల్‌లో ప్రారంభం కాగా, సౌదీ అరేబియాకు చెందిన డెరాహ్ పెర్ఫ్యూమ్స్ సిటీ సెంటర్‌లో ప్రారంభమైంది. రిటైల్ చైన్ ఫ్లయింగ్ టైగర్ మాల్ ఆఫ్ ఖతార్‌లో అదనపు అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. ఫ్రెంచ్ బేకరీ మరియు కేఫ్ బ్రాండ్ మైసన్ కేసర్ దోహా ఒయాసిస్‌లో ఖతార్‌లో తన మొదటి శాఖను ప్రారంభించింది.
ఇక షాపింగ్ సెంటర్ రెంట్స్ త్రైమాసిక ప్రాతిపదికన స్థిరంగా ఉన్నాయని, మధ్యస్థ నెలవారీ అద్దెలు చదరపు మీటరుకు సగటున QR178.8గా ఉన్నాయని నివేదిక హైలైట్ చేసింది. అయితే, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే అద్దెలు 2 శాతం తగ్గాయి.
2026 మొదటి త్రైమాసికంలో దోహాలోని వీధి రిటైల్ అద్దెలు గతేడాదితో పోలిస్తే 4 శాతం తగ్గాయి. రాజధాని వెలుపల రెంట్స్ త్రైమాసికానికి 2 శాతం మరియు సంవత్సరానికి 5.2 శాతం తగ్గాయని తెలిపింది.
దోహాలోని చాలా ప్రాంతాలలో రిటైల్ రెంట్స్ త్రైమాసిక ప్రాతిపదికన స్థిరంగా ఉన్నాయి. అయినప్పటికీ అల్ సద్, దఫ్నా, ముంతజా మరియు వెస్ట్ బే వంటి ప్రాంతాలలో 5 శాతం వరకు వార్షిక తగ్గుదలలు నమోదైనట్లు వాల్యూస్ట్రాట్ రీసెర్చ్ హెడ్ అనుమ్ హసన్ వెల్లడించారు.

