Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి

రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి

maa gulf 5 days ago

'నాట్స్' కాఫీ విత్ కాప్ సూపర్ హిట్! అమెరికా: అమెరికా చట్టాలపై అవగాహన, భద్రత పట్ల భరోసా కల్పిస్తూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ రాలీ విభాగం నిర్వహించిన వినూత్న కార్యక్రమం "కాఫీ విత్ కాప్" సూపర్ హిట్ అయింది.

నార్త్ కరోలైనా రాష్ట్రంలోని క్యారీ నగరంలో గల బాండ్ పార్క్ కమ్యూనిటీ సెంటర్‌లో కాఫీ విత్ కాప్ జరిగింది. సమాజానికి, శాంతిభద్రతల పరిరక్షించే పోలీసులకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడింది. ముఖ్యంగా నేటి తరం పిల్లలు, టీనేజర్లలో చట్టవ్యవస్థపై నమ్మకాన్ని, అవగాహనను పెంచేందుకు 'నాట్స్' కాపీ విత్ కాప్ నిర్వహించింది.

నాట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేక్ కౌంటీ షెరీఫ్ విల్లీ రోవ్, మాస్టర్ డెప్యూటీ జోసెఫ్ స్మోక్స్, మాస్టర్ డెప్యూటీ వేన్ వాన్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సదస్సులో ప్రవాస తెలుగు పిల్లలు, యువత ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా పాల్గొన్నారు. తాము నిత్యం ఎదుర్కొనే అంశాలపై పోలీసులకు ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీస్ శాఖ విధులు, అత్యవసర సమయాల్లో ప్రాణరక్షణ మార్గాలు, సమాజ భద్రతలో యువత బాధ్యతలపై పిల్లలు అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు షెరీఫ్ విల్లీ రోవ్ అంతే ఓర్పుతో, స్నేహపూర్వకంగా సమాధానాలిస్తూ వారిలో ధైర్యాన్ని నింపారు. మాస్టర్ డెప్యూటీలు జోసెఫ్ స్మోక్స్, వేన్ వాన్‌లు తమ వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ, పిల్లలంతా సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

మానసిక ఒత్తిళ్ల పై నిపుణుల మార్గదర్శకత్వం
శాంతిభద్రతలతో పాటు నేటి తరం ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై కూడా ఈ వేదికగా కాపీ విత్ కాప్‌లో కీలక చర్చ జరిగింది. స్కూల్ బుల్లీయింగ్, టీనేజ్ ఒత్తిళ్లు, సైకాలజికల్ సమస్యలపై పిల్లలకు, తల్లిదండ్రులకు ప్రముఖ వైద్యులు డాక్టర్ రేష్మి శరంగ, డాక్టర్ వినయ్ శరంగ గారలు చక్కటి అవగాహన కల్పించారు. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమో వారు వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
నాట్స్ మాజీ చైర్మన్ డాక్టర్ మధు కొర్రపాటి పర్యవేక్షణలో.. నాట్స్ రాలీ టీమ్ కాపీ విత్ కాప్‌ను దిగ్విజయంగా నిర్విహించింది. నాట్స్ రాలీ టీమ్ సభ్యులు వెంకట్ దగ్గుబాటి, ఉమ నార్నే, కల్పన అధికారి, లక్ష్మి తుబాటి, భాను నిజాంపట్నం, రవితేజ ఖాజా, వేణునాథ్ వెల్లంకి, సాయి రావళి మిరియాలలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పోలీసు అధికారులతో నేరుగా ముఖాముఖి మాట్లాడేలా, మనసు విప్పి సమస్యలు పంచుకునేలా నాట్స్ చేసిన ప్రయత్నాన్ని స్థానిక తెలుగు వారు ప్రత్యేకంగా అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu