అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. యూఏఈలోని ఫుజైరా ఓడరేవుకు సమీపంలో లంగరు వేసి ఉన్న ఒక నౌకను గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా హైజాక్ చేశారు.
ఈ నౌకను ఇరాన్ జలాల వైపు మళ్లిస్తున్నట్లు బ్రిటన్ సముద్ర భద్రతా సంస్థ (UKMTO) వెల్లడించడంతో హర్మూజ్ జలసంధి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సముద్రంలో మునిగిన భారత నౌక 'హాజీ అలీ'
మరోవైపు ఒమన్ తీరంలో భారతీయ జెండాతో ప్రయాణిస్తున్న 'హాజీ అలీ' అనే సరుకు రవాణా నౌక డ్రోన్ దాడికి గురై సముద్రంలో మునిగిపోయింది. గుజరాత్‌కు చెందిన ఈ నౌక సోమాలియా నుండి షార్జాకు పశువులను తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. నౌకలో ఉన్న 14 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ తీర రక్షక దళం సురక్షితంగా కాపాడింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న ఈ దాడులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.
చైనా సూపర్ ట్యాంకర్ పై పొంచి ఉన్న ముప్పు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనలో ఉన్న తరుణంలో, హర్మూజ్ జలసంధిలో చైనాకు చెందిన 'యువాన్ హువా హు' అనే ముడి చమురు ట్యాంకర్‌పై కూడా దాడుల ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం అందుతోంది. గత రెండు నెలలుగా గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న ఈ నౌక తాజాగా జలసంధిని దాటింది. ఇరాన్ నౌకలపై అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతున్న వేళ ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

