Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగపూర్‌లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు

సింగపూర్‌లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు

maa gulf 3 weeks ago

సింగపూర్: స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ తన సప్తమ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ 25, 2026న ఘనంగా నిర్వహించింది. సింగపూర్ శివకృష్ణ దేవాలయ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రొఫెసర్ బి.వి.ఎస్.చౌదరి, శ్రీమతి రాజ్యలక్ష్మి చౌదరి సమక్షంలో కార్యక్రమం వైభవంగా జరిగింది.

స్వరలయ సంస్థ విద్యార్థులు సంగీతం, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కుమారి శ్రీవిద్య పంతువరాళి రాగంలో ఆలపించిన "ఎన్నగాను రామభజన" త్యాగరాజ కీర్తన విశేషంగా ఆకట్టుకుంది.స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు, గురువు శేషుకుమారి ఆలపించిన "ప్రక్కల నిలబడి" త్యాగరాజ కీర్తన, మీరా భజన్, విద్యార్థులతో కలిసి ప్రదర్శించిన జానపద గీతం ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి.

ఈ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం గ్రేడ్ మరియు యూనివర్సిటీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన సంగీత విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ నిత్యానందరావు అర్హతాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదివినప్పటికీ చిన్ననాటి నుంచే సంగీతంపై ఉన్న ఆసక్తి శ్రీమతి శేషుకుమారిని కర్నాటక సంగీతాన్ని భావితరాలకు అందించే స్థాయికి తీసుకెళ్లిందని కొనియాడారు.

హార్మనీ & హ్యూస్ అధ్యక్షురాలు శ్యామల మాట్లాడుతూ, తిరుపతిలో జరిగిన అన్నమాచార్య 500వ జయంతి ఉత్సవాల్లో స్వరలయ చేసిన సంగీత కచేరీ, అలాగే శేషుకుమారి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డు అందుకోవడం సంస్థకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆమెను "సింగపూర్ గాన కోకిల"గా అభివర్ణించారు.

కుమారి మనోజ్ఞ అనే గాత్ర సంగీత విద్యార్థి మాట్లాడుతూ, కర్నాటక సంగీతాన్ని O-Level ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకుని పరీక్షలు రాయడానికి సింగపూర్ విద్యాశాఖ నుంచి అనుమతి పొందడం తన గురువు మార్గదర్శకత్వం వల్లే సాధ్యమైందని తెలిపారు.

ఈ ఏడాది నుంచి స్వరలయ ఆర్ట్స్ కార్యకలాపాలను విస్తరించి, గురు శ్రీమతి కృష్ణ శృతి మార్గదర్శకత్వంలో కూచిపూడి నృత్యాన్ని ప్రవేశపెట్టినట్లు శ్రీమతి శేషుకుమారి వెల్లడించారు. సంగీత శిక్షణలో భాగంగా తాళం, రాగం నేర్పించేందుకు వినూత్న సంగీత ఆటలను ప్రవేశపెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కార్యక్రమంలో యూటీఐఏఈసీ చైర్మన్ రాయ్, ట్రెజరర్ ఆదేష్ బాబు, కళ, శివకృష్ణ ఆలయ చైర్మన్, మేనేజర్, శ్రీసాంస్కృతిక కళాసారధి అధ్యక్షుడు కవుటూరి రత్నకుమార్, కాకతీయ సబ్బు, సింగపూర్ తెలుగు వనితల సమూహ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సౌజన్య చక్కటి వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. పిల్లల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించగా, స్వరలయ ఆర్ట్స్ సింగపూర్‌లో భారతీయ సంగీత, నృత్య సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu