హైదరాబాద్: తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది.
ఓవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు వేడిగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎండల తీవ్రతతో జనం విలవిలలాడిపోతున్నారు. ఇది చాలదన్నట్లు భారత వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది.
తెలంగాణకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మే 20 వరకు తెలంగాణలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా, వేడి సంబంధిత అనారోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులు సూచించారు.
ఆరెంజ్ అలర్ట్ అంటే ప్రజలకు ముఖ్యంగా శిశువులు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వారికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉందని అర్థం.
ఈ సుదీర్ఘ పొడి వాతావరణంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా, వేడి సంబంధిత అనారోగ్యాల తీవ్రమైన ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ (DPH) జాగ్రత్తలు చెప్పింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో బయట తిరగడాన్ని పరిమితం చేసుకోవాలంది. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలంది. నీరు, ఓఆర్ఎస్, లేదా సాంప్రదాయ ద్రవాలను ఉపయోగించి శరీరంలో తగినంత నీటిని నిలుపుకోవాలని ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు.

