Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!

విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!

maa gulf 1 week ago

దోహా: సమ్మర్ హాలీడేస్ సందర్భంగా విదేశీ ప్రయాణాలు పెరుగుతున్న వేళ.. డయబెటిక్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఖతార్‌లోని హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) సూచించింది.

ప్రయాణాన్ని సురక్షితంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళిక ఎంతో అవసరమని పేర్కొంది. విదేశీ ప్రయాణానికి కనీసం నాలుగు నుంచి ఆరు వారాల ముందే వైద్యుడిని సంప్రదించాలని హెచ్‌ఎంసీ సూచించింది. ఈ సందర్భంగా పేషంట్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అవసరమైతే మందుల మోతాదులో మార్పులు చేస్తారని తెలిపింది. అలాగే జెట్ ల్యాగ్, డీహైడ్రేషన్, టైమ్ జోన్ మార్పుల వల్ల మందుల వినియోగ సమయాల్లో వచ్చే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో సలహాలు ఇస్తారని వెల్లడించింది.

అవసరానికి మించి మెడిసిన్స్ వెంట తీసుకెళ్లండి ప్రయాణంలో ఆలస్యం కావడం లేదా సామాను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున అవసరమైన దానికంటే కొంత ఎక్కువ మందులను వెంట తీసుకెళ్లాలని హెచ్‌ఎంసీ సూచించింది. మందులను వాటి అసలు ప్యాకింగ్‌లో, స్పష్టమైన లేబుళ్లతో ఉంచాలని తెలిపింది. అదేవిధంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్, మెడికల్ రిపోర్టులు, ఆరోగ్య పరిస్థితి, తీసుకుంటున్న చికిత్స వివరాలతో కూడిన డాక్టర్ లెటర్ కూడా వెంట ఉంచుకోవాలని పేర్కొంది. అవసరమైతే వీటిని స్థానిక భాషలోకి అనువదించుకోవడం మంచిదని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో లేదా కస్టమ్స్ తనిఖీల సమయంలో ఇవి ఉపయోగపడతాయని తెలిపింది. ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరి ప్రతి ప్రయాణికుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ వెంట తీసుకెళ్లాలని హెచ్‌ఎంసీ సూచించింది. ఇందులో బ్యాండేజీలు, యాంటీసెప్టిక్ మందులు, నొప్పి నివారణ మాత్రలతో పాటు ఆయా వ్యాధులకు అవసరమైన వైద్య పరికరాలు కూడా ఉండాలని తెలిపింది. మధుమేహ రోగులు గ్లూకోమీటర్, ఆస్తమా బాధితులు ఇన్‌హేలర్ వంటి అత్యవసర పరికరాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించింది.

ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రయాణించే దేశంలో వైద్య సేవలు ఎలా అందుబాటులో ఉన్నాయో ముందుగానే తెలుసుకోవాలని హెచ్‌ఎంసీ సూచించింది. ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు కూడా వర్తించే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్సతో పాటు మెడికల్ ఎవాక్యుయేషన్ ఖర్చులను కూడా కవర్ చేసే ఇన్సూరెన్స్ ఉంటే మరింత ప్రయోజనకరమని తెలిపింది. ప్రత్యేక ట్రావెల్ క్లినిక్‌లు ప్రయాణికులకు వైద్య సలహాలు, అవసరమైన టీకాలు, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సూచనలు అందించేందుకు హెచ్‌ఎంసీ ప్రత్యేక ట్రావెల్ క్లినిక్‌లను నిర్వహిస్తోంది. ప్రత్యేక ఆరోగ్య ప్రమాదాలు ఉన్న దేశాలకు వెళ్లేవారికి ఈ సేవలు మరింత ఉపయోగకరంగా ఉంటాయని తెలిపింది. అలాగే ఖతార్‌లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం మందులను ఇంటికే పంపించే సేవలను కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది.

విదేశీ ప్రయాణం ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత స్వల్ప ఆరోగ్య సమస్యలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య అధికారులు సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, వైద్యుల సూచనలు పాటిస్తే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా విదేశీ ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చని హమద్ మెడికల్ కార్పొరేషన్ పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu