Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థుల సురక్షిత రవాణాకు సరికొత్త ప్రణాళిక: సైబరాబాద్ సీపీ రమేష్

విద్యార్థుల సురక్షిత రవాణాకు సరికొత్త ప్రణాళిక: సైబరాబాద్ సీపీ రమేష్

maa gulf 1 week ago

హైదరాబాద్: సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు విద్యార్థులకు సురక్షితమైన, అందుబాటు ధరల్లో రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంతో సమగ్ర విద్యార్థుల మొబిలిటీ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ వెల్లడించారు.

సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) చైర్మన్‌గా ఉన్న డాక్టర్ రమేష్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో యూట్యూబ్ వేదికగా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు.

విద్యార్థుల రవాణాను సాంకేతికత ఆధారిత, సమాజ భాగస్వామ్యంతో కూడిన, పోలీసుల ధృవీకరణ కలిగిన వ్యవస్థగా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన చెప్పారు. పాఠశాలలు, కళాశాలల వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, అసురక్షిత రవాణా విధానాలు, అందుబాటులో ఉన్న రవాణా వనరుల సమర్థ వినియోగం లేకపోవడం వంటి సమస్యలకు ఈ ప్రణాళిక పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు.

ఆర్టీసీ, ప్రైవేట్ రవాణా సేవల సమన్వయం

ఈ ప్రతిపాదిత వ్యవస్థలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ రవాణా సేవలను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. పారదర్శకత, నిబంధనల అమలు, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల రవాణా నిర్వహించనున్నారు.

అదేవిధంగా పోలీసుల ధృవీకరణ పొందిన గిగ్ వర్కర్లు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బందిని అటెండెంట్లు, మొబిలిటీ సూపర్‌వైజర్లుగా నియమించి విద్యార్థుల భద్రతను మరింత పటిష్ఠం చేయడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పించనున్నారు.

పాఠశాలల వద్ద భారీ ట్రాఫిక్ రద్దీ

ఈ సందర్భంగా సీపీ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ, పాఠశాలలు ముగిసే సమయంలో కేవలం 15 నిమిషాల వ్యవధిలో సుమారు 2 లక్షల వాహనాలు స్కూళ్ల పరిసరాలకు చేరుకుంటున్నాయని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఈ రద్దీ సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో ఉండే ట్రాఫిక్ కంటే ఎక్కువగా ఉంటోందన్నారు.

పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడం, తీసుకురావడం సమయంలో తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారని, దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు, పాఠశాలల మధ్య సమాచార లోపం కారణంగా విద్యార్థులు స్కూల్‌లలోనే ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలు కూడా నమోదయ్యాయని వివరించారు.

లండన్ ట్రాన్స్‌పోర్ట్ నమూనాలో ప్రణాళిక

సైబరాబాద్ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ సంయుక్తంగా 526 విద్యాసంస్థలు, 4.1 లక్షల మంది విద్యార్థులపై నిర్వహించిన సర్వేలో ప్రస్తుత విద్యార్థుల రవాణా వ్యవస్థలో అనేక లోపాలు వెలుగులోకి వచ్చినట్లు సీపీ తెలిపారు.

ఈ కొత్త విధానం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ (TFL) నమూనా స్ఫూర్తితో రూపొందించబడుతోందన్నారు. ఇందులో రూట్ ఆప్టిమైజేషన్, నిబంధనల పర్యవేక్షణ, కేంద్రీకృత నిర్వహణ, డిజిటల్ సమన్వయం, స్మార్ట్ మొబిలిటీ మేనేజ్‌మెంట్ వంటి అంశాలు ఉంటాయని చెప్పారు.

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే మొబిలిటీ రంగంలో పనిచేస్తున్న ఓ స్టార్టప్ సంస్థను సాంకేతిక భాగస్వామిగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభ దశలో విద్యార్థుల రవాణా డేటా విశ్లేషణ, స్కూల్ గేట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌లు, తల్లిదండ్రుల అవగాహన కార్యక్రమాలు, రూట్ ప్లానింగ్ చేపట్టనున్నారు.

ఈ వ్యవస్థలో భాగమైన అన్ని వాహనాలకు సీసీటీవీ కెమెరాలు అమర్చడంతో పాటు వాటిని సైబరాబాద్ పోలీసుల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు.

యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ సమావేశంలో సుమారు 5,000 మంది తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డీసీపీ చి. శ్రీనివాస్, ట్రాఫిక్ అదనపు డీసీపీ హనుమంతరావు, ఎస్‌సీఎస్‌సీ సీఈఓ నవీద్ ఖాన్, విద్యార్థుల మొబిలిటీ వ్యవస్థకు సంబంధించిన ప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu