Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విమానంలో కుప్పకూలిన ప్రయాణికుడికి ప్రాణాధారంగా నిలిచిన యూఏఈ నర్స్

విమానంలో కుప్పకూలిన ప్రయాణికుడికి ప్రాణాధారంగా నిలిచిన యూఏఈ నర్స్

maa gulf 1 week ago

రెండో విమాన ప్రయాణంలోనే అప్రమత్తంగా స్పందించిన రాక్ హాస్పిటల్ నర్సు అఖిలావియన్ నీలకందన్

దుబాయ్: దుబాయ్ నుంచి తిరుచిరాపల్లి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ప్రయాణికుడు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే యూఏఈలోని రాక్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న నర్సు అఖిలావియన్ నీలకందన్ సమయస్ఫూర్తితో స్పందించి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు.

మే 12న దుబాయ్ నుంచి బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే 32 ఏళ్ల ప్రయాణికుడు కుప్పకూలి స్పృహ కోల్పోయాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమాన సిబ్బంది వైద్య సిబ్బంది సహాయం కావాలని ప్రకటించగా, విమానం వెనుక భాగంలో కూర్చున్న నీలకందన్ వెంటనే ముందుకు వచ్చారు.

"ప్రయాణికుడిని పిలిచినా స్పందించలేదు. అయితే శ్వాస కొనసాగుతుండటంతో వెంటనే ప్రాథమిక చికిత్స ప్రారంభించాను," అని ఆమె తెలిపారు. కొద్దిసేపటికి మరో వైద్యుడు సహకరించడంతో ఇద్దరూ కలిసి ప్రయాణికుడిని విమానం ముందు భాగానికి తరలించి చికిత్స అందించారు.

విమానంలో పరిమిత వైద్య సదుపాయాలే ఉన్నప్పటికీ, డాక్టర్ సూచనల మేరకు నీలకందన్ ప్రయాణికుడికి ఐవీ లైన్ అమర్చారు. ఆయన రక్తపోటు ఎక్కువగా ఉండగా, పల్స్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికుడు తీవ్ర వణుకు, మూర్ఛ లక్షణాలతో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు.

"అతనికి చలిగా అనిపించడంతో బెడ్‌షీట్ కప్పి చేతులు, కాళ్లు రుద్దుతూ వేడి కల్పించాం. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి ఉండొచ్చని అనుమానించాం. కానీ విమానంలో గ్లూకోజ్ పరీక్షించే పరికరం లేదు," అని నీలకందన్ చెప్పారు.

సుమారు రెండు గంటలపాటు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలక్ట్రోలైట్ సపోర్ట్, ఐవీ ఫ్లూయిడ్స్ అందించడంతో ప్రయాణికుడు క్రమంగా కోలుకున్నాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత అతనికి జ్యూస్ ఇచ్చి ప్రయాణం ముగిసే వరకు ఆరోగ్య పరిస్థితిని గమనించినట్లు తెలిపారు.

భారతదేశానికి విమానం చేరుకున్న వెంటనే ముందుగా అప్రమత్తం చేసిన ఎయిర్‌పోర్ట్ వైద్య బృందాలు ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించాయి. ప్రయాణికుడి ప్రాణాలను కాపాడినందుకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది నీలకందన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతా లేఖ అందజేశారు.

తన మొదటి సెలవుల కోసం స్వదేశానికి వెళ్తున్న నీలకందన్‌కు ఇది జీవితంలో రెండో విమాన ప్రయాణం కావడం విశేషం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu