Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

MAHAA News 3 weeks ago

Balka Suman Arrest: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భిన్నమైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం ‘తెలంగాణ భవన్’ నుంచి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ ప్రవీణ్ నేతృత్వంలోని పోలీసు బృందం భవనంలోకి వెళ్లి సుమన్‌ను అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ హఠాత్ పరిణామంతో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ నెల 26వ తేదీన తెలంగాణ భవన్‌లో జరిగిన ఒక సమావేశంలో బాల్క సుమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. దీనిపై మరుసటి రోజే (మే 27న) పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుండి గత మూడు రోజులుగా సుమన్ తెలంగాణ భవనంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేయడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు మూడు రోజులుగా భవన్ వెలుపల కాపలా కాశారు. శనివారం పోలీసులు లోపలికి రావడంతో ఆయన అరెస్ట్ ఖాయమైంది.

పోలీసులు తనను అదుపులోకి తీసుకునే ముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి గట్టిగా ప్రశ్నిస్తున్న వారిని టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో (2009-2014) కూడా తనపై 226 కేసులు పెట్టారని, ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, తెలంగాణ భవనంలోనే ఉన్నానని స్పష్టం చేస్తూ.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు సుమన్ అరెస్ట్ కాకముందే ఆయన తరఫు లాయర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. తాము ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశామని, ఆ విషయం తెలిసి కూడా పోలీసులు కావాలనే హడావుడి చేస్తున్నారని లాయర్ విమర్శించారు. బాల్క సుమన్ కేవలం మాట్లాడారు తప్ప ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయలేదని, అందువల్ల ఈ కేసులు చెల్లవని ఆయన పేర్కొన్నారు. చట్టపరంగా తాము ఈ కేసును ఎదుర్కొంటామని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని లాయర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ, లాయర్ లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే పోలీసులు సుమన్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News