Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

CBSE: సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్‌ దాడి.. పేమెంట్స్ సిస్టమ్‌ హ్యాక్!

MAHAA News 0 months ago

CBSE: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రీవాల్యుయేషన్ పోర్టల్‌ లక్ష్యంగా సైబర్ దాడి జరిగింది. మార్కుల రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఫీజులు చెల్లించే పేమెంట్ సిస్టమ్‌ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ దాడి కారణంగా దాదాపు 50 మంది విద్యార్థులు ఎలాంటి అనుమతి లేకుండానే అనధికారికంగా పోర్టల్‌లోకి లాగిన్ అయినట్లు ప్రభుత్వ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

ఇటీవల విడుదలైన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో కొత్తగా తీసుకొచ్చిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానం వల్ల తమ సమాధాన పత్రాలు తారుమారయ్యాయని కొందరు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన బోర్డు.. విద్యార్థులు తమ జవాబు పత్రాల స్కాన్ కాపీలను చూసుకుని, రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ దరఖాస్తుల ఫీజు చెల్లించే హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) పేమెంట్ గేట్‌వేపైనే తాజాగా సైబర్ దాడి జరగడం కలకలం రేపింది.

రూ.1 నుంచి రూ.68 వేలు.. గందరగోళంలో ఫీజుల వివరాలు!
ఈ సైబర్ దాడి కారణంగా పేమెంట్ సిస్టమ్‌లో తీవ్రమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. ఫీజు చెల్లించే సమయంలో ఒక్కో విద్యార్థికి ఒక్కో రకమైన అమౌంట్ చూపిస్తూ గందరగోళం సృష్టించారు. కొందరికి కేవలం రూ.1 చూపిస్తే, మరికొందరికి ఏకంగా రూ.68 వేల వరకు ఫీజు చూపిస్తూ స్క్రీన్‌పై డిస్‌ప్లే అయ్యింది. ఈ విషయాన్ని గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఐటీ నిపుణులు రంగంలోకి దిగి ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించే పనిలో పడ్డారు.

20 జవాబు పత్రాలు తారుమారు.. బోర్డు వివరణ!
మరోవైపు ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంలో జవాబు పత్రాలు మారిపోయాయన్న విద్యార్థుల ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. మొత్తం వివాదంలో కేవలం 20 జవాబు పత్రాలు మాత్రమే తారుమారయ్యాయని, ఆయా విద్యార్థులను సంప్రదించి వారికి సరైన పేపర్లను అందించామని స్పష్టం చేశాయి.

ఈ ఏడాది సీబీఎస్‌ఈ బోర్డు మొత్తం 98 లక్షలకు పైగా జవాబు పత్రాలకు సంబంధించిన 40 కోట్ల పేజీలను ఈ కొత్త పద్ధతిలో స్కాన్ చేసింది. ఇందులో కేవలం 68 వేల పత్రాల్లో మాత్రమే క్వాలిటీ సమస్యలు రావడంతో, వాటిని గుర్తించి మళ్లీ రీస్కాన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News