Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Chintoor: ఏడేళ్ల పాప మృతి, 53 మందికి అస్వస్థత.. గిరిజన పల్లెలో తీవ్ర ఆందోళన!

MAHAA News 1 week ago

Chintoor: పచ్చని కొండల నడుమ ప్రశాంతంగా ఉండే ఓ గిరిజన పల్లెలో ఒక్కసారిగా విషాదం కమ్ముకుంది. చిన్నారుల నవ్వులతో కళకళలాడాల్సిన గ్రామం.. హాస్పిటల్ సైరన్లు, తల్లిదండ్రుల గుండెకోతలతో మూగబోయింది.

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీ పరిధిలోని గొల్లగుప్ప గ్రామంలో ఏకంగా 53 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. వీరిలో అత్యధికులు బడికి వెళ్లే పసిపిల్లలే కావడం అందరినీ కలచివేస్తోంది.

ఈ ఘటనలో చికిత్స పొందుతూ స్థానిక జీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి మడివి జమున కన్నుమూసింది. చేతికి అందిన బిడ్డ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

అసలేం జరిగింది?

గొల్లగుప్ప గ్రామంలో రెండు రోజుల క్రితమే పద్దం రోజా (11) అనే మరో బాలిక కడుపునొప్పితో ప్రాణాలు కోల్పోయింది. అలాగే గ్రామంలో నాలుగు మలేరియా కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన గౌరీదేవిపేట పీహెచ్‌సీ సిబ్బంది మంగళవారం గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించారు. గ్రామస్తులు, బడి పిల్లలకు మలేరియా నివారణ కోసం క్లోరోక్విన్ (క్లోరోఫిన్) మాత్రలు పంచారు. ఆ మాత్రలు మింగిన కాసేపటికే గ్రామంలోని చిన్నారులు, కొందరు పెద్దలు తీవ్ర కడుపునొప్పి, వాంతులు, కళ్లు తిరిగి కింద పడిపోయారు. అప్పటివరకు ఆడుకున్న బిడ్డలు ఒకరి తర్వాత ఒకరు కుప్పకూలడంతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు చెలరేగాయి.

ఆసుపత్రుల్లో చికిత్స - ముమ్మర వైద్య సేవలు..

అస్వస్థతకు గురైన వారిలో 34 మందిని (32 మంది పిల్లలు, ఇద్దరు పెద్దలు) హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో జమున ప్రాణాలు కోల్పోగా, మిగిలిన 33 మంది ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించిన మరో 19 మందిలో పరిస్థితిని గమనించి, ముందస్తు జాగ్రత్తగా 13 మంది చిన్నారులను కూడా మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఉన్నతాధికారుల పరామర్శ - అసలు కారణంపై ఆరా..

విషయం తెలుసుకున్న చింతూరు ఐటీడీఏ (ITDA) ప్రాజెక్ట్ అధికారి శుభం నొక్వాల్, ఏఎస్పీ హేమంత్ వెంటనే భద్రాచలం ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారులను, వారి తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు ఎలాంటి లోటు లేకుండా అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ ఘోరానికి కలుషిత నీరు, ఆహారం కారణమా? లేక ఇచ్చిన మాత్రల మోతాదు వికటించి (రియాక్షన్ వచ్చి) ఇలా జరిగిందా? అనే కోణంలో ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత బృందాలు గ్రామానికి చేరుకుని నీరు, రక్త నమూనాలను సేకరిస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులు మరణించడంతో గొల్లగుప్ప గ్రామం విషాదంలో మునిగిపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News