Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

CM Vijay: సంచలన నిర్ణయం.. 'అమ్మ కాంటీన్ల' రూపురేఖలు మార్చాలని ఆదేశాలు!

MAHAA News 5 days ago

CM Vijay: తమిళనాడు వ్యాప్తంగా పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్న ప్రభుత్వ రాయితీ భోజన కేంద్రాలు 'అమ్మ ఉపాహార కేంద్రాల' (Amma Canteens) రూపురేఖలను మార్చడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ శ్రీకారం చుట్టారు.

రాష్ట్రంలోని అన్ని అమ్మ కాంటీన్లను తక్షణమే పునరుద్ధరించాలని, వాటి నిర్వహణ ప్రమాణాలను పెంచాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను సీఎం ఆదేశించారు. కాంటీన్లలో వడ్డించే ఆహార నాణ్యత, రుచిపై వచ్చిన కొన్ని క్షేత్రస్థాయి నివేదికలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

మౌలిక వసతుల పెంపు.. తక్షణ మరమ్మతులు!

తమిళనాడు సీఎంఓ (CMO) విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమ్మ కాంటీన్ల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 383, ఇతర మున్సిపాలిటీల్లో 237 కాంటీన్లు నడుస్తున్నాయి. వీటిలో చాలా కేంద్రాలకు అత్యవసర మరమ్మతులు, మౌలిక వసతుల ఆధునికీకరణ అవసరమని సీఎం గుర్తించారు. ఎలాంటి ఆలస్యం లేకుండా పునరుద్ధరణ పనులను యుద్ధప్రతిపాదికన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

ఆధునిక వంట గదులు – పరిశుభ్రతకు ప్రాధాన్యం

దినసరి కూలీలు, పట్టణ కార్మికులు ఇంకా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు తక్కువ ధరలోనే పౌష్టికాహారం నిరంతరాయంగా, సురక్షితమైన వాతావరణంలో అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా అధికారులు క్రింది చర్యలు తీసుకోనున్నారు.

  • పాత సామాగ్రి మార్పు: కాంటీన్లలో ఉన్న పాడైపోయిన వంట పాత్రలు, పాతబడిన కిచేన్ ఎక్విప్‌మెంట్‌ను తక్షణమే మార్చనున్నారు.

  • వంటశాలల ఆధునికీకరణ: వంట వసతులను మోడరనైజ్ చేసి, మరింత వేగంగా, సురక్షితంగా వంటలు చేసేలా వసతులు కల్పిస్తారు.

  • నిరంతర తనిఖీలు: వంట గదులు, డైనింగ్ ఏరియాలలో పరిశుభ్రతను కాపాడటానికి స్థానిక సంస్థల అధికారులు క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు.

  • ఫిర్యాదుల పరిష్కారం: ఆహార నాణ్యతపై ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు.

గతంలో మద్యం దుకాణాలపై వేటు.. ప్రజా సంక్షేమమే పరమావధి!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి విజయ్ ప్రజా సంక్షేమ నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. గతంలో ఆయన పాఠశాలలు, కాలేజీలు, గుడులు ఇంకా బస్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ ‘టాస్మాక్’ (TASMAC) మద్యం దుకాణాలను మూసివేయాలని సంచలన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించి, కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఆ షాపులను మూయించి మహిళల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు అమ్మ కాంటీన్ల పునరుద్ధరణ నిర్ణయంతో మరోసారి పేద ప్రజల పక్షపాతిగా నిలిచారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News