Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Crime News: బెయిల్ వచ్చిన గంటల్లోనే గంజాయి తాగుతున్న వీడియో వైరల్..

MAHAA News 5 days ago

Crime News: హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హిట్ అండ్ రన్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ వేగంగా కారు నడిపి ఒకరి మృతికి కారణమైన కేసులో బెయిల్ పొందిన కొన్ని గంటల్లోనే, అతడు గంజాయి పీలుస్తున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం రేపింది.

ఈ పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు కేసు దర్యాప్తును మరో కోణంలో వేగవంతం చేశారు.

బెయిల్ మంజూరు.. ప్రాథమిక పరీక్షల్లో నెగెటివ్..

ఈ నెల 1న రాయదుర్గం పరిధిలో మితిమీరిన వేగంతో కారు నడిపి ఒకరి ప్రాణాలు తీసిన ఘటనలో సందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం అనంతరం కారు ఆపకుండా వెళ్లిపోవడంతో (హిట్ అండ్ రన్) పలు సెక్షన్లతో పాటు మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ప్రమాద సమయంలో సందీప్ మద్యం సేవించలేదని తేలింది. ప్రాథమికంగా నిర్వహించిన యూరిన్ డ్రగ్స్ స్క్రీనింగ్ పరీక్షల్లోనూ నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

తెరపైకి గంజాయి వీడియో - ఎఫ్‌ఎస్‌ఎల్‌కు రక్త నమూనాలు..

బెయిల్‌పై విడుదలైన మరుసటి రోజే సందీప్ గంజాయి పీలుస్తున్నట్లు ఉన్న ఓ వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. దీనిపై స్పందించిన రాయదుర్గం సీఐ భూపతి.. ఆ వీడియో పాతదే అయినప్పటికీ దానిపై పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నామని స్పష్టం చేశారు.

తాజా ఆరోపణల నేపథ్యంలో సందీప్ నుంచి రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి (FSL) పంపినట్లు వెల్లడించారు. ఈ అధునాతన ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా గత కొన్ని నెలల క్రితం ఏవైనా మాదక ద్రవ్యాలు తీసుకున్నా నిర్ధారణ అవుతుందని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News