Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Crime News: కిటికీలోంచి దూకి.. అత్యాచారం, హత్య చేశాడు.. చివరికి ఎలా దొరికాడు అంటే..?

MAHAA News 1 week ago

Crime News: హైదరాబాద్ శివారు పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో కలకలం రేపిన యువ నర్స్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.

ఒంటరిగా ఉన్న నర్స్‌పై లైంగిక దాడికి పాల్పడి, ఆపై అత్యంత దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు.. స్థానికంగా పనిచేసే మెకానిక్ మహ్మద్ సనావుల్లా ఖాన్ (34)ను అరెస్ట్ చేశారు. ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో పాటు ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది.

అసలేం జరిగింది?..

ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి కొన్ని నెలల క్రితం నగరానికి వచ్చి తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా చేరింది. దింతో ఆమె హాస్పిటల్ దగ్గరలోని హాస్టల్ లో చేరింది ఆమె తో పాటు ఇంకో ఇద్దరు అదే గదిలో ఉండేవారు. కానీ రాఖీ పండుగ సందర్భంగా రూమ్‌మేట్స్ ఊరికి వెళ్లడంతో ఆమె గదిలో ఒంటరిగా ఉంది.

ఆసుపత్రి పక్కనే ఉన్న మెకానిక్ షాపులో పనిచేసే బిహార్‌కు చెందిన సనావుల్లా ఖాన్.. ఆసుపత్రి నర్సుల కదలికలను గత నెల నుండి గమనిస్తూ వచ్చాడు. దింతో యువతి ఒంటరిగా ఉన్న విషయాన్ని పసిగట్టి అర్ధరాత్రి వేళ గ్రిల్స్ లేని కిటికీ గుండా గదిలోకి ప్రవేశించాడు.

దాడి & గొంతు నులిమి హత్య..

నిందితుడు యువతిపై లైంగిక దాడికి యత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించి కేకలు వేసింది. దీంతో శబ్దం బయటకు రాకుండా ఆమె తలపై బరువైన వస్తువు/సుత్తితో దాడి చేసి, గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఆమె బయటకు రాకపోవడం, తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తోటి సిబ్బంది కిటికీ గుండా చూడగా.. ముఖంపై తీవ్ర గాయాలతో విగతజీవిగా పడి ఉన్న దృశ్యం కనిపించింది.

దర్యాప్తులో దొరికిపోయిన నిందితుడు..

నేరం జరిగిన తర్వాత ఏమీ తెలియనట్లు నిందితుడు ఘటనా స్థలంలోనే దర్జాగా తిరిగాడు. డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్న సమయంలో "ఏం జరిగింది?" అంటూ పోలీసులనే ఆరా తీశాడు. పోలీస్ జాగిలాలు నేరుగా పక్కనే ఉన్న మెకానిక్ షాపు వద్దకు వెళ్లడం, అలాగే ఘటన జరిగిన అర్ధరాత్రి నిందితుడు షాపు యజమానికి పదేపదే ఫోన్ కాల్స్ చేసినట్లు తేలడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.

పోస్టుమార్టం రిపోర్ట్..

ఉస్మానియా ఆసుపత్రిలో నిర్వహించిన పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో యువతిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది. నిందితుడు రోహింగ్యా అంటూ సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారాన్ని పోలీసులు తోసిపుచ్చారు.

ఉస్మానియా ఆసుపత్రి వద్ద నిరసనలు - ఉద్రిక్తత..

బాధితురాలి మృతి వార్త తెలియడంతో కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద బాధితురాలి కుటుంబానికి మద్దతుగా స్థానికులు, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నిందితుడిపై కఠిన చట్టాల కింద ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపి ఉరిశిక్ష లేదా కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News