Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Gold Crown Missing: గుడివాడ వెంకన్న 'బంగారు కిరీటం' బ్యాంకులో తాకట్టు..!

MAHAA News 3 days ago

Gold Crown Missing: కృష్ణా జిల్లా గుడివాడలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల నమ్మకాన్ని, సెంటిమెంట్‌ను నట్టేట ముంచిన ఒక దిగ్భ్రాంతికరమైన మోసం వెలుగులోకి వచ్చింది.

స్వామివారి అలంకరణ కోసం ఒక భక్తుడు కోట్లాది రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని విరాళంగా ఇస్తే.. ఆలయ కమిటీ సభ్యులు దాన్ని గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకులో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నారు. దాదాపు ₹70 లక్షల విలువైన ఆ దేవుడి సొత్తును తమ సొంత అవసరాల కోసం, భవన ఆధునికీకరణ కోసం వాడుకోవడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.

81 ఏళ్ల వయసులో దాతకు నమ్మకద్రోహం!

గుడివాడలోని ఆర్యవైశ్య కల్యాణమండపానికి చెందిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి 2025 జనవరిలో మాటూరి సుబ్బారావు అనే దాత సుమారు 461 గ్రాముల బరువు, వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని (విలువ సుమారు ₹70 లక్షలు) స్వామివారికి బహూకరించారు.

ఇటీవల 81 ఏళ్ల వయసున్న సుబ్బారావు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి వెళ్లగా, అక్కడ స్వామివారికి కిరీటం అలంకరించి లేదు.

కిరీటం ఏదని ఆలయ కమిటీని నిలదీయగా.. అది సేఫ్‌గా బ్యాంకు లాకర్‌లో ఉందని చెప్పారు.”నాకు 81 ఏళ్లు వచ్చాయి, చనిపోయేలోపు ఒక్కసారి ఆ కిరీటంతో స్వామివారిని చూడాలని ఉంది, అలంకరించండి” అని సుబ్బారావు వేడుకోగా.. అది మరో బ్యాంకు లాకర్‌లో ఉందంటూ కమిటీ సభ్యులు మాట మార్చారు.

అనుమానం వచ్చి దాత గట్టిగా ఆరా తీయడంతో అసలు లీకు బయటపడింది. కల్యాణ మండపం ఆధునికీకరణ పనుల కోసం ఆ బంగారు కిరీటాన్ని బ్యాంకులో ₹38 లక్షలకు కుదువ (తాకట్టు) పెట్టినట్లు కమిటీ సభ్యులు ఒప్పుకున్నారు. దీంతో ఆ వృద్ధ దాత తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యారు.

పోలీసుల స్పందన ఏంటి?

భగవంతుడి సొత్తును పక్కదారి పట్టించిన ఈ వంచనపై దాత సుబ్బారావు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఆలయం దేవాదాయ శాఖ (Endowments Department) పరిధిలోకి రాదని, ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ ఆలయం (ఆర్యవైశ్య కమిటీ ఆధ్వర్యంలోనిది) కావడంతో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని పోలీసులు తెలిపారు.

గుడివాడ పట్టణ సీఐ హనీష్ స్పందన:“కిరీటం కనిపించడం లేదని దాత మా దృష్టికి తెచ్చారు. అయితే కిరీటం ఇచ్చినప్పుడు ఆలయ కమిటీ వారు దాతకు ఎలాంటి రసీదు ఇవ్వలేదు, కనీసం రిజిస్టర్‌లో కూడా నమోదు చేయలేదు. ఇది ప్రైవేటు ఆలయం కాబట్టి, కమిటీ వారికి నోటీసు ఇచ్చి.. వారు స్పందించకుంటే చట్టప్రకారం కోర్టు ద్వారా వెళ్లాలని దాతకు సూచించాం.”

కిరీటాన్ని వెనక్కి ఇచ్చేయండి: భక్తుల డిమాండ్

అందరి సమక్షంలో భక్తితో స్వామివారికి సమర్పించిన కానుకలతో ఇలా వ్యాపారం చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పవిత్రతను, భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసిన ఈ కమిటీ చేతుల్లో కిరీటం ఉండటానికి వీల్లేదని దాత సుబ్బారావు స్పష్టం చేస్తున్నారు. దాన్ని వెంటనే రికవరీ చేసి తమకు అప్పగిస్తే, భక్తుల నమ్మకాన్ని కాపాడే మరో మంచి ఆలయానికి దాన్ని సమర్పిస్తామని దాతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిన కమిటీ అధ్యక్షుడు పోకూరి మోహనరావు అందుబాటులో లేకపోవడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News