Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Hyderabad: రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ రికార్డుల వేట.. ఎకరా భూమి ధర రూ. 237 కోట్లు!

MAHAA News 2 weeks ago

Hyderabad: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 'తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్' (TGIIC) నిర్వహించిన భూముల వేలంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.

హైదరాబాద్‌లోని రాయదుర్గం మక్తా ప్రాంతంలో జరిగిన వేలంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇక్కడ కేవలం ఒక్క ఎకరా భూమి ఏకంగా రూ. 237 కోట్ల పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం 6 ఎకరాల 29 గుంటల భూమిని వేలం వేయగా, దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 1,490 కోట్ల భారీ ఆదాయం సమకూరింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘త్రి ట్రిలియన్ డాలర్ల’ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ సంకల్పానికి తగ్గట్టుగానే TGIIC ఆన్‌లైన్ (e-Auction) ద్వారా ఈ వేలం ప్రక్రియను నిర్వహించింది. ఈ స్థలానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర (రిజర్వ్ ప్రైస్) రూ. 139 కోట్లు మాత్రమే. కానీ, హైదరాబాద్ మార్కెట్ ఉన్న డిమాండ్ కారణంగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘గౌర వెంచర్స్’ ఏకంగా 70.5 శాతం ఎక్కువ రేటు పాడుకుని రూ. 237 కోట్లకు ఈ ల్యాండ్‌ను దక్కించుకుంది.

రాయదుర్గం మక్తాలోని సర్వే నెంబర్ 83/1 లో ఉన్న ప్లాట్ నెం. 1A, 1/F భూములకు ఈ వేలం జరిగింది. ఎకరాకు రూ. 237 కోట్లు పలకడం అనేది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం దక్షిణ భారతదేశంలోనే అత్యంత భారీ రికార్డు అని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు హైదరాబాద్ నగరాన్ని ఒక సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా చూస్తున్నారనడానికి ఈ వేలమే నిదర్శనమని TGIIC స్పష్టం చేస్తోంది. ఈ స్థలంలో గౌర వెంచర్స్ సంస్థ ఒక భారీ ఐటీ టవర్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది కూడా రాయదుర్గం పరిధిలోనే జరిగిన వేలంలో ఎకరాకు రూ. 177 కోట్ల ధర పలికింది. అప్పట్లో అదే పెద్ద రికార్డు అనుకున్నారు, కానీ ఈసారి ఆ రికార్డు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ, కోకాపేట వంటి ప్రాంతాల పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇక్కడ పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయనే నమ్మకంతోనే ఇన్వెస్టర్లు పోటీ పడుతున్నారు. కాగా, ఇదే ఏరియాలో ఉన్న మరో 5.09 ఎకరాల భూమిని జూన్ 1వ తేదీన వేలం వేయడానికి TGIIC అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News