Dailyhunt

Kishan Reddy: తెలంగాణ వైఫల్యాలే కేరళలో చెబుతారా?.. సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్‌రెడ్డి ఫైర్

MAHAA News 1 week ago

Kishan Reddy: కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారతీయ జనతా పార్టీపై చేస్తున్న విమర్శలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.

తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కేరళకు వెళ్లి లేని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చని రేవంత్‌రెడ్డి, కేరళలో ఏ మొహం పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగానైతే అబద్ధపు మాటలతో ప్రజలను నమ్మించారో, ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని రేవంత్ అనడం సరికాదని, అసలు దశాబ్దాల కాలంగా బీసీల సంక్షేమాన్ని విస్మరించింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు. బీసీల కోసం కాంగ్రెస్ ఏం చేసిందో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలైపోయాయని కేరళలో రేవంత్‌రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, భవిష్యత్తులో మన రాష్ట్రంలో కూడా ఇలాగే మాయమాటలు చెబుతారని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ, పొరుగు రాష్ట్రాల్లో గొప్పలు చెప్పుకోవడం ప్రజలను వంచించడమేనని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News