Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

KTR: కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేస్తారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్!

MAHAA News 16 hrs ago

KTR: తెలంగాణలో మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో పడేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీలో, పార్లమెంట్‌లో బీఆర్ఎస్ పార్టీ లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల పార్లమెంట్‌లో ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును అవమానించేలా మాట్లాడినా.. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీకి చెందిన తెలంగాణ ఎంపీలు కనీసం నోరు విప్పకుండా మౌనంగా ఉండిపోయారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా 'ఫ్యూచర్ సిటీ' అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని, కానీ ఇప్పుడున్న హైదరాబాద్ నగరంలో కనీస సౌకర్యాలు కల్పించే దిక్కులేదని ఆయన ఎద్దేవా చేశారు. ఉన్న నగరాన్ని సరిగ్గా చూసుకోలేని ఇలాంటి నాయకుడు.. ఇక కొత్తగా ఫ్యూచర్ సిటీని ఏం నిర్మిస్తాడని కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ నదిని తామే ప్రక్షాళన చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మూసీ ప్రక్షాళన పనులు మొదలయ్యాయని ఆయన గుర్తు చేశారు. మూసీని శుభ్రం చేయడానికి బీఆర్ఎస్ కాలంలోనే అనేక ప్రాంతాల్లో ఎస్‌టీపీలను ఏర్పాటు చేశామని చెప్పారు.

త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికల గురించి కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో పూర్తిగా సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్రజల్లో మంచి పేరు ఉండి, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే ఈసారి టికెట్లు దక్కుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేసేలా కార్యకర్తలంతా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News