Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Pawan Kalyan: మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

MAHAA News 4 days ago

Pawan Kalyan: రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మత్స్యకారులకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రెండో ఏడాది కూడా విజయవంతంగా విడుదల చేశామని ఆయన చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వానికి ఎంత నిబద్ధత ఉందో చెప్పడానికి ఈ నిర్ణయమే ఒక నిదర్శనమని ఆయన అభివర్ణించారు.

గత ప్రభుత్వం మత్స్యకారుల భృతి కింద కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చేదని, కానీ కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి రూ.20 వేలకు పెంచిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం రూ.262 కోట్లను ఖర్చు చేస్తోందని, దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 లక్షల మంది మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు. అలాగే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే 6,897 మంది మత్స్యకారులకు రూ.13.79 కోట్ల ఆర్థిక సాయం అందుతోందని స్పష్టం చేశారు.

తీరప్రాంతాల్లోని మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా అడ్డుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పవన్ కల్యాణ్ అన్నారు. వారి సొంత ఊర్లలోనే మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లా పరిధిలోని 119 కిలోమీటర్ల కోస్తా తీర ప్రాంతంలో ఉన్న 23 ల్యాండింగ్ సెంటర్లు, 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాలు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News