Dailyhunt

Ram Mohan Naidu: చరిత్రలో నిలిచిపోయే ప్రజా రాజధాని అమరావతి

MAHAA News 1 week ago

Ram Mohan Naidu: తెలుగు ప్రజలందరికీ ఇవాళ ఒక చరిత్రాత్మకమైన రోజని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఉద్ఘాటించారు. రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో అమరావతి ఒక గొప్ప 'ప్రజా రాజధాని'గా చరిత్రలో నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీ రాజధాని విషయంలో గత కొంతకాలంగా ఉన్న సందిగ్ధతకు ఈ బిల్లుతో పూర్తి స్పష్టత లభిస్తుందని, ఇది తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన జరిగిన తీరుపై రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో వాజ్‌పేయీ హయాంలో మూడు రాష్ట్రాల విభజన ఎంతో సాఫీగా సాగిందని, కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఒక రాష్ట్రానికి రాజధాని ఉంచి, మరో రాష్ట్రానికి ఏమీ లేకుండా వదిలేయడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తాయని చెప్పారు. విభజన సమయంలో ఏపీ సుమారు 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌తో ఉన్నప్పటికీ, ఐదు కోట్ల మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై నమ్మకంతో ముందుకు సాగారని ఆయన గుర్తు చేశారు.

కష్టాలను అవకాశాలుగా మార్చుకోవడం తమ నాయకుడు నేర్పిన విద్య అని చెబుతూ.. అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఒక గొప్ప పరిణామమని కొనియాడారు. అయితే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ‘మూడు రాజధానుల’ పేరుతో నాటకమాడిందని, రాజధాని కోసం పోరాడిన రైతులను, మహిళలను హింసించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణులు అని కూడా చూడకుండా పోలీసులు లాఠీలతో కొట్టిన రోజులను గుర్తు చేస్తూ, రాజధాని కోసం నిలబడ్డ మహిళలందరికీ సాష్టాంగ నమస్కారం చేస్తున్నానని ఆయన భావోద్వేగంతో అన్నారు.

చరిత్రను పరిశీలిస్తే ప్రపంచంలోని గొప్ప నగరాలన్నీ నదీ తీరాల్లోనే విలసిల్లాయని, అందుకే కృష్ణా నది ఒడ్డున అమరావతిని నిర్మించాలని నిర్ణయించినట్లు రామ్మోహన్ నాయుడు వివరించారు. 2014లోనే అసెంబ్లీలో అమరావతిపై ఏకగ్రీవ తీర్మానం జరిగిందని, ఇప్పుడు ఈ బిల్లు ద్వారా దానికి పూర్తి స్థాయి చట్టబద్ధత లభిస్తోందని చెప్పారు. అమరావతిని ఒక అద్భుతమైన, ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News