Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Telangana: ఆసిఫాబాద్‌లో కలకలం.. స్నానం చేయమన్నారని బావిలోకి దూకిన ఇంటర్ విద్యార్థిని!

MAHAA News 3 days ago

Telangana: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఒక వింత ఘటన వెలుగు చూసింది. స్నానం చేయకుండా అదే పనిగా మొబైల్ ఫోన్ చూస్తున్న కూతురిని తల్లిదండ్రులు మందలించడంతో, మనస్తాపానికి గురైన ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

స్థానిక ఎస్‌హెచ్‌వో బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ పట్టణంలోని సందీప్‌నగర్‌కు చెందిన స్వర్ణలత, పోచీరాం దంపతుల కుమార్తె సాత్విక (17) ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసి, రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది.

బుధవారం ఇంట్లో కూర్చుని ఫోన్ చూస్తున్న సాత్వికను స్నానం చేయమని కుటుంబ సభ్యులు కాస్త గట్టిగా మందలించారు. దీంతో తీవ్ర కోపానికి, మనస్తాపానికి గురైన బాలిక.. పక్క వీధిలో ఉన్న బావి వద్దకు పరుగెత్తుకెళ్లి అందులోకి దూకేసింది. అయితే, బావిలో పడగానే ప్రాణభయంతో ఆ బాలిక గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. ఆమె కేకలు విన్న కాలనీవాసులు వెంటనే అప్రమత్తమై, 100 నంబర్‌కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందిని రంగంలోకి దించారు. ఫైర్ ఫైటర్ నరేష్, ఫైర్‌మెన్ రాము, డ్రైవర్ ప్రవీణ్‌కుమార్‌లు తాడు సాయంతో బావిలోకి దిగారు. నీటిలో కొట్టుమిట్టాడుతున్న బాలికకు రక్షణ జాకెట్ తొడిగి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సకాలంలో స్పందించి బాలిక ప్రాణాలు కాపాడిన పోలీసులు, ఫైర్ సిబ్బందిని కాలనీ ప్రజలతో పాటు ఉన్నతాధికారులు కూడా ఎంతగానో అభినందించారు.

చిన్న విషయానికే అంత పెద్ద నిర్ణయం తీసుకున్న బాలికకు పోలీసులు గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. బావిలో దూకిన సమయంలో బాలిక కాలికి స్వల్ప గాయమవడంతో, ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనా సమయానికి అధికారులు స్పందించడంతో ఒక ప్రాణం నిలిచిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News